ప్రజాస్వామ్యం ఫర్ సేల్!

Sarpanch seat auctions during Telangana panchayat elections

అవును. ప్రజాస్వామ్యం అమ్మకానికి పెట్టారు. అదీ వేలంపాటలో! ఎలా అంటే.. వచ్చే నెల తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికలు జరుగబోతున్నాయి.

ఈ ఎన్నికలలో ముఖ్యంగా మూడు ప్రధానాంశాలు కనిపిస్తున్నాయి. 1. సర్పంచ్ పదవులు వేలంపాట, 2. ఈ ఎన్నికలలో రాజకీయ పార్టీలు జోక్యం, 3. వేలంపాటలో పదవులు కొనుక్కొన్న వారు రోడ్డున పడటం.

ADVERTISEMENT

ఈ ఎన్నికలలో సర్పంచ్ పదవులకు జోరుగా వేలం పాటలు జరుగుతున్నాయి. ఈ వేలం పాటల వార్తలు మీడియాలో ప్రముఖంగానే వస్తున్నాయి. కానీ ఎన్నికల సంఘానికి అవి కనపడటం లేదు. బహుశః అందుకే వాటినీ అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు.

రాజకీయాలు, పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ ఎన్నికలకు పార్టీలు దూరంగా ఉండాలి. కానీ వాటి కనుసన్నలలోనే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు అభ్యర్ధులు ఎంపిక అవుతున్నారు.

ఈ ఎన్నికలలో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోకుండా ఎన్నికల సంఘం ఎలాగూ అడ్డుకోలేదు. కనీసం ప్రజాస్వామ్యాన్ని ఈవిదంగా బహిరంగంగా వేలం పాటలు వేస్తుంటే వాటిని అడ్డుకోకపోవడాన్ని ఏమనుకోవాలి?

వేలం పాటలో లక్షల రూపాయలు చెల్లించి సర్పంచ్ పదవులను కొనుక్కోవడానికి ఎందుకు గ్రామస్తులు పోటీ పడుతున్నారు?

అంటే పంచాయితీ ఎన్నికలు పూర్తయి గ్రామ పంచాయితీలు ఏర్పాటు అయితే కేంద్ర ప్రభుత్వం వాటికి భారీగా నిధులు అందిస్తుంది. అభివృద్ధి పనుల పేరుతో నాలుగు రాళ్ళు వెనకేసుకుకోవచ్చనే ఆశతోనే అనుకోవాలి.

కానీ గతంలో అనేక మంది ఇలాగే పోటీలు పడి సర్పంచ్ పదవులు కొనుక్కున్నారు. ఎలాగూ నిధులు వస్తాయనే ధీమాతో ఆస్తులు, ఇంట్లో ఆడవాళ్ళ మెడలో మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టి లేదా అప్పులు చేసి అభివృద్ధి పనులు చేయించారు. కానీ నిధులు రాకపోవడంతో రోడ్డున పడ్డారు. అలా నష్టపోయిన ఓ సర్పంచ్ ఇప్పుడు ఎవరూ వేలంపాటలో సర్పంచ్ పదవులు కొనుక్కొని జీవితాలు నాశనం చేసుకోవద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నారు.

కానీ ఎవరైనా వింటేగా? తెలంగాణలో జోరుగా వేలంపాటలు సాగుతూనే ఉన్నాయి. కనుక చరిత్ర పునరావృతం అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories