బెంగాల్ తృణమూల్ కోట కూలితే తర్వాత తెలంగాణ?

Telangana Political Shift

ఏపీలో ఎల్లప్పుడూ జోరుగా రాజకీయాలు సాగుతూనే ఉంటాయి. కానీ కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్‌ పార్టీ ప్రకటనతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఏపీని మించిపోయాయి అనిపిస్తుంది. కానీ తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీ ఓడిపోయి గులాబీ కారు ఫామ్‌హౌసులో గ్యారేజీకి చేరిన తర్వాత కూడా కాంగ్రెస్‌-బీఆర్ఎస్‌ల మద్య రాజకీయాలు జోరుగానే సాగాయి. దానికీ కేసీఆరే కారణం.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందని బెదిరించడంతో అవి మొదలయ్యాయి. సిఎం రేవంత్ రెడ్డి అప్రమత్తమయ్యి బీఆర్ఎస్‌ నుంచి పది మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలను లాగేయడంతో వేడెక్కాయి. కానీ కేసీఆర్‌ ఫామ్‌హౌసులో ఉండగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండున్నరేళ్ళు పూర్తిచేసుకుంది.

ADVERTISEMENT

పదవుల కోసం మంత్రులు కొట్టుకొని ప్రభుత్వాన్ని కూల్చేస్తారనుకుంటే సిఎం రేవంత్ రెడ్డి అందరినీ ఒక తాటిపై నడిపిస్తూనే ఉన్నారు.

కానీ ఆర్ధిక సమస్యలు, విధానపరమైన తప్పులు, కాళేశ్వరం ప్రాజెక్టు పాడుబెట్టేసి రైతులకు నీళ్ళు లేకుండా చేయడం, అదే సమయంలో కాళేశ్వరం కేసుతో కేసీఆర్‌, హరీష్‌ రావులను ఏమీ చేయలేకపోవడం నిసహాయతే.

సిఎం రేవంత్ రెడ్డి నెలకు రెండుమూడు సార్లు ఢిల్లీ పర్యటనలపై బీఆర్ఎస్‌ పార్టీ అనుమానాలకు సంతృప్తికరమైన సమాధానాలు చెప్పకపోవడం ప్రజలను ఆలోచింపజేయకుండా ఉండవు.

హైడ్రా కూల్చివేతలతో ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తి, రాష్ట్రంలో మళ్ళీ అస్తవ్యస్తమైన కాంగ్రెస్‌ మార్క్ పాలన… వంటి అనేక అంశాలు కాంగ్రెస్‌ పార్టీకి, ప్రభుత్వానికి ప్రతికూల అంశాలుగా నిలుస్తున్నాయి. వీటన్నిటినీ సరిదిద్దగల పరిస్థితి కూడా కనిపించడం లేదు.

కానీ సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికల వ్యూహాలకు తిరుగు లేదు. ఇదొక్కటే ఆశ కాంగ్రెస్‌ పార్టీకి ఉంది. ఈ ఆశ, నమ్మకంతోనే కాంగ్రెస్‌ పార్టీ గుడ్డిగా ముందుకు సాగుతుంటే, కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని ఈ లోపాలు, వైఫల్యాలే తనని మళ్ళీ సిఎం కుర్చీలో కూర్చోబెడతాయనే ధీమాతోనే ఎన్నికల వరకు కేసీఆర్‌ ఫామ్‌హౌసులో పడుకోవచ్చని భావిస్తున్నారేమో?

కానీ కేసీఆర్‌-బీఆర్ఎస్‌ నేతల ఆశలకు ఆయన కూతురు కల్వకుంట్ల కవిత స్వయంగా ‘టీఆర్ఎస్‌ పార్టీతోనే’ అడ్డుగోడ నిర్మించడానికి సిద్దపడటం పెద్ద సంకటమే. ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి అనిశ్చిత రాజకీయ పరిస్థితులు నెలకొని ఉంటే బిజేపికి అంత కన్నా కావాల్సింది ఏముంటుంది?

మే 4న బెంగాల్, తమిళనాడు కంచుకోటల్లో ఏ ఒక్కటి కూలిపోయినా, బిజేపి తదుపరి లక్ష్యం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రమే అవుతుంది. అప్పుడు అసలైన ఆట మొదలవుతుంది. అప్పుడు ఎవరు ఏ గట్టుకి మారుతారో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories