ktr-revanth-reddy-bandi-sanjay

తెలంగాణలో అధికార కాంగ్రెస్, విపక్ష బిఆర్ఎస్, బీజేపీ ల మధ్య ట్రయాంగిల్ రాజకీయ పోరు నడుస్తుంది. బీజేపీ తో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్యి బిఆర్ఎస్ ను దెబ్బకొట్టడానికి చూస్తుందంటూ బిఆర్ఎస్, బిఆర్ఎస్, కాంగ్రెస్ కలిపి బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నారంటూ బీజేపీ, బీజేపీ, బిఆర్ఎస్ తెరవెనుక రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ పై దాడి చేస్తున్నాయి అంటూ కాంగ్రెస్ ఇలా గత కొంత కాలంగా తెలంగాణ రాజకీయాలు ఈ మూడు పార్టీల మధ్య ట్రయాంగిల్ ప్రేమ కథ మాదిరి సాగుతున్నాయి.

అయితే ఈ విమర్శలలో ఏ పార్టీ ప్రజలకు వాస్తవాలు చెపుతుంది, ఏ పార్టీ విమర్శలలో నిజాయితీ ఉంది అనే విషయానికొస్తే ఇక్కడ అన్ని పార్టీలు కూడా ఎదుటివారి పై బురద జల్లే రాజకీయమే చేస్తున్నాయి కానీ అసలు విషయాన్ని మాత్రం సొంత పార్టీ నేతలకు సైతం చెప్పడం లేదు.

Also Read – అమెరికా- చైనా టిట్ ఫర్ టాట్ గేమ్స్ ఓకే కానీ..

అయితే అసలు విషయానికొస్తే తాజాగా తెలంగాణలో మూడు పార్టీల మధ్య ఈ తరహా రాజకీయ విమర్శలు మళ్ళీ మొదలయ్యాయి. ముందుగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్దకు వస్తే, ఈ మాజీ మంత్రి అతి త్వరలోనే తెలంగాణలో జరుగుతున్న భారీ కుంభకోణాన్ని భయటపెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

తాజాగా తెలంగాణలో అంటుకున్న కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూమి వివాదానికి సంబంధించి ఈ తరహావ్యాఖ్యలు చేసారు కేటీఆర్. ఇది ప్రభుత్వం చెపుతున్నట్టు కేవలం 400 ఎకరాల సమస్య కాదని, అంతకు మించి ఇంకా దాని వెనుక కొన్ని వేల కోట్ల రూపాయల వ్యవహారం ఉందంటూ ఆరోపించారు కేటీఆర్.

Also Read – ఇక్కడ బిఆర్ఎస్.. అక్కడ టీడీపీ: కల్వకుంట్ల కవిత

ఈ భారీ కుంభకోణంలో బీజేపీ ఎంపీ పాత్ర కూడా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. అందుకు గాను ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే, మరొకరు ఢిల్లీకి బ్యాగ్లు మోస్తున్నారంటూ పరోక్షంగా కాంగ్రెస్, బీజేపీ నేతలను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు ఈ మాజీ మంత్రి.

అలాగే రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలోనే ఉందంటూ, ఇక్కడి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఢిల్లీ లోని బీజేపీ పెద్దల కోసం పని చేస్తున్నారంటూ ఈ రెండు పార్టీ ల మధ్య అంతర్గత బంధం ఉందంటూ మండిపడ్డారు కేటీఆర్.

Also Read – భారత్‌ పాలిట కరోనాలా పాక్.. టీకాలు తప్పవు

ఇక బిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ వాదన ఇలా ఉంటే, టి.బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ మరో వాదనతో తెరమీదకొచ్చారు. తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య మంచి స్నేహ బంధం ఉందని, సీఎం రేవంత్, కేటీఆర్ మంచి ప్రాణ మిత్రులని, అందుకే కేటీఆర్ ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన ఇంకా అరెస్టు కాలేదంటూ కాంగ్రెస్, బిఆర్ఎస్ ల పై ఎదురుదాడికి దిగారు బండి.

రేవంత్, కేటీఆర్ కలిసి రాష్ట్ర సంపదను దోచేస్తున్నారని, వీరిద్దరూ కలిసే తమిళనాడులోని స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి వెళ్లారని, సొంత రాష్ట్రంలో కుస్తీలు, పొరుగు రాష్ట్రంలో దోస్తీలు వీరి నైజం అంటూ, ఈ రెండు పార్టీల అక్రమ బంధం తెలంగాణలో బీజేపీ ని దెబ్బకొట్టడానికే అంటూ కాంగ్రెస్, బిఆర్ఎస్ ల రాజకీయ బంధం పై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు బండి సంజయ్.

ఇక ఈ రెండు పార్టీల నాయకులు చేసిన విమర్శలకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బదులిస్తుందో అందరు ఊహించవచ్చు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి కేంద్రంలో ఉన్న బీజేపీ తో బిఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పై దుమ్మెత్తిపోస్తుందంటూ కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ ల స్నేహబంధం పై తనకున్న అనుమానాలను తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది.

అయితే ఏది ఏమైనప్పటికి తెలంగాణలో మాత్రం ఈ ట్రయాంగిల్ రాజకీయాలతో బిఆర్ఎస్ ఒకసారి భారీ మూల్యం చెల్లించింది, అయిన ఇప్పటికి అదే తరహా రాజకీయంతో బిఆర్ఎస్ ముందుకెళ్తుంది, ఇక బీజేపీ ఈ రెండు పార్టీల రాజకీయంతో తెలంగాణలో బలం పెంచుకోలేక సతమతమవుతోంది.




అధికార కాంగ్రెస్ మాత్రం ఈ రెండు పార్టీల రాజకీయంతో తనకున్న రాజకీయ బలాన్ని కోల్పోతుంది. మరి రానున్న రోజులలో ఈ ట్రయాంగిల్ విచిత్ర ప్రేమ కథ ఏ పార్టీకి మేలు చేస్తుందో.? ఏ పార్టీకి పట్టం కడుతుందో చూడాలి.