దేశంలో అధికార, ప్రతిపక్షాలు ఒకే అంశంపై వినిపిస్తున్న భిన్న వాదనలతో సామాన్య ప్రజలకు ఏది తప్పో ఏది ఒప్పో తెలియని పరిస్థితి నెలకొందంటే అతిశయోక్తి కాదు.
దీనికి తోడు ఈ రాజకీయాలతో ముడిపడిన మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న భిన్నమైన కధనాలు, వాదనలతో ప్రజలలో ఈ గందరగోళం ఇంకా పెంచుతూనే ఉన్నాయి.
రాజకీయ పార్టీలు, వాటి నాయకులు మద్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్యపోరుని సమర్థత-అసమర్థతకి, నీతి-అవినీతికి, ప్రజాస్వామ్యానికి-నిరంకుశపాలనకు మద్య జరుగుతున్న పోరాటాలుగా వర్ణించుకుంటున్నారు. వీటన్నిటి కారణంగా ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోతున్నారు.
ఇందుకు ఓ ఉదాహరణ. ప్రస్తుతం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్, సింగరేణి బొగ్గు కుంభకోణం కేసుపై అధికార ప్రతిపక్షాల మద్య విమర్శలు, ప్రతివిమర్శలు వినిపిస్తున్నాయి.
తాము ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయలేదని, ఎటువంటి తప్పుడు పనులు చేయలేదని కేటీఆర్ అన్నారు. ఇది రాజకీయకక్ష సాధింపేనని వాదిస్తున్నారు.
ఇదే సమయంలో సింగరేణి నైని గనులు దక్కించుకోవడం కోసం ఇద్దరు కాంగ్రెస్ మంత్రులు పోటీ పడిన విషయం బయటపడింది. దీనిపై విచారణ జరిపించాలంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు నేడు గవర్నర్‌ని కలిసి వినతి పత్రం సమర్పించనున్నారు.
కేసీఆర్ హయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవమని ఆయన కుమార్తె కల్వకుంట్ల కవితతో సహా కాంగ్రెస్, బిజేపి నేతలు, ఇంకా పలువురు వాదిస్తున్నారు. కానీ అబద్దమని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు.
ఈ కేసు మెల్లగా కేసీఆర్ మెడకు చుట్టుకునే దశకు చేరుకోవడంతో, సింగరేణి కట్టుకధతో రచ్చ చేస్తున్నారని కాంగ్రెస్ మంత్రులు ఆరోపిస్తున్నారు.
ఈవిధంగా అధికారంలో ఉన్నవారు ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతూ, ప్రతిపక్షంలోకి మారగానే తాము ఎటువంటి అవినీతికి పాల్పడలేదంటూ అధికారపార్టీయే అవినీతికి పాల్పడుతోందంటూ వారి అవినీతి భాగోతాలు బయటపెడుతున్నారు. ఇప్పుడు ప్రజలు ఎవరిని నమ్మాలి?
ఈ విషయంలో మేధావులు కూడా కులం, మతం, ప్రాంతం, భాషల వారీగా చీలిపోయి తమ అభిప్రాయాలను ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారు.
దేశ ప్రజలందరూ కలిసికట్టుగా పోరాడి దేశానికి స్వాతంత్ర్యం సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు రాజకీయపార్టీల నాయకులు అవినీతికి పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటుంటే వారిని నిలదీయాల్సిన ప్రజలు వారి మాయమాటలే నమ్ముతూ అనేక వర్గాలుగా చీలిపోతున్నారు. ఇది చాలా బాధాకరం కాదా?






