కులం గెలిపిస్తుంది కానీ మతం?

Analysis of religion and caste influence on Telangana election politics

ఏపీ రాజకీయాలను కులాలు శాశిస్తే, తెలంగాణ రాజకీయాలను మతాలు శాశిస్తాయి. ఇప్పుడీ ప్రస్తావన దేనికంటే ఇటీవల తెలంగాణ బీజేపి ఎంపీలు ఈటల రాజేందర్‌, బండి సంజయ్‌ మద్య జరిగిన వాదనలే.

తెలంగాణలో మత రాజకీయాలను నమ్ముకుంటే బీజేపి ఎప్పటికీ అధికారంలోకి రాలేదని, అన్ని వర్గాలను కలుపుకుపోతేనే సాధ్యమన్నారు ఈటల రాజేందర్‌. కానీ మెజార్టీ జనాభా కలిగిన హిందువులను కాదనుకున్న ఏ పార్టీ మనుగడ సాగించలేదని బండి సంజయ్‌ అన్నారు.

ADVERTISEMENT

మజ్లీస్ ముస్లింలని, బీజేపి హిందువులను నమ్ముకుని రాజకీయాలు చేస్తుంటాయనేది రహస్యమేమీ కాదు. ఈవిధంగానే మజ్లీస్ బీహార్‌ ఎన్నికలలో పోటీ చేసి 5 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. మజ్లీస్ మద్దతుతోనే కాంగ్రెస్‌ పార్టీ జూబ్లీహిల్స్‌ సీటుని గెలుచుకుంది. కనుక రాజకీయాలలో మతం పాత్ర కాదనలేము.

తెలంగాణలో మత రాజకీయాలకు ఆస్కారం ఉంది కనుకనే మజ్లీస్ పార్టీ మనుగడ సాగించగలుగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలను శాశించగలుగుతోంది. ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు దానికి దాసోహం అంటున్నాయి. కనుక వాటిని విమర్శించేందుకు, ఆ పేరుతో హిందుత్వ అజెండాతో రాజకీయాలు చేసేందుకు బీజేపికి అవకాశం లభిస్తోంది.

ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నచోటే మజ్లీస్ ప్రగల్భాలు పలకగలదు. ప్రతాపం చూపగలదు. కనుక ఆ ప్రాంతాలలో హిందువుల తరపున మాట్లాడుతూ, వారి ఓట్లు పొందే నైతిక హక్కు ఆటోమేటిక్‌గా బీజేపికి లభిస్తోంది.

ఇదివరకు గ్రేటర్ హైదరాబాద్‌ కార్పోరేషన్ ఎన్నికలలో ఇలాగే బీజేపి, మజ్లీస్ కత్తులు దూసుకొని ఎవరి వాటా ఓట్లు అవి సంపాదించుకున్నాయి.

అయితే ముస్లింలు లేని చోట మజ్లీస్‌కి చోటు ఉండదు. కనుక అక్కడ బీజేపి వేరే అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలపై అస్త్రాలు సంధిస్తూ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తుంటుంది.

కానీ కొన్నిసార్లు ఇందుకు పూర్తి భిన్నంగా కూడా ఫలితాలు వస్తుంటాయి.

ఉదాహరణకి ఏపీలో జగన్‌ మైనార్టీ ఓటు బ్యాంక్ కోసమే బీజేపికి దూరంగా ఉండిపోయారు. అయినా గెలవలేకపోయారు. కానీ అదే బీజేపితో జత కట్టిన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్‌ ఇద్దరూ ఘన విజయం సాధించారు. అధికారంలోకి వచ్చారు.

కనుక రాజకీయాలతో మతం ప్రాధాన్యత చాలా ఎక్కువే అయినప్పటికీ, ఎన్నికలలో గెలుపోటములు అనేక ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటాయని స్పష్టమవుతోంది.

తెలంగాణ విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో ముస్లిం జనాభా చాలా ఎక్కువ. కానీ దానికి రెండు మూడు రెట్లు హిందూ జనాభా ఉంది. దానిలో 50శాతం పైగా బీసీలున్నారు.

వారి సంఖ్య పలువురు బీసీ నాయకులను ఊరిస్తుంటుంది. కనుక మతం ఆధారంగా మజ్లీస్, బీజేపి రాజకీయాలు చేసి మంచి ఫలితాలు సాధిస్తునట్లే, బీసీ పార్టీలు పెట్టి వారి ఓట్లు నొల్లేసుకొని అధికారంలో వచ్చేయవచ్చనుకునేవారు బోర్లా పడుతుంటారు. ఎందువల్లనంటే, కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు అనేక ఉపాయాలతో బీసీలను ఆకర్షించి పంచేసుకుంటాయి కనుక.

ఈ హిందూ, ముస్లిం, బీసీ జనాభా నేపధ్యంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తంగా చూసినట్లయితే కేవలం మతం ఆధారంగా ఎన్నికలలో విజయం సాధించడం కష్టమనే ఈటల రాజేందర్‌ వాదన సహేతుకమనే అర్ధమవుతుంది.

ADVERTISEMENT
Latest Stories