
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నయా రాయ్‌పూర్‌లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫొటోగ్రాఫర్‌గా మారిపోయారు. ఛత్తీస్‌గడ్ రాష్ట్ర సీఎం రమణ్‌సింగ్‌తో కలిసి నందన్‌వన్ జంగల్ సఫారీని తిలకించిన మోడీ ఓ కెమెరాను తీసుకుని, బోనులో ఉన్న పులిని ఫోటోలు తీశారు. ఈ సమయంలో ఆ పులి మోడీని అదే పనిగా చూస్తూ, ఒక రకంగా ఫోటోలకు ఫోజులిచ్చింది.
పులిని వివిధ భంగిమలలో ఫోటోలు తీయడం కోసం పలు రకాలుగా మోడీ ప్రయత్నించగా, పులి కూడా ఫోటోలు తీస్తున్న సమయంలో ఏ మాత్రం కదలకుండా ఉండిపోయింది. మోడీ కెమెరా పట్టుకుని తీస్తోన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో షికార్లు కొడుతోంది. మాజీ ప్రధాని వాజ్ పేయి హయాంలో కొత్తగా ఏర్పడిన ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఎంతో సామరస్యంగా అవతరించాయని, ఛత్తీస్‌గఢ్ అభివృద్ధిలో ముందుకెళుతోందని, రానున్న తరాలకు ఈ అభివృద్ధి ఎంతగానో తోడ్పడుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.



