జగన్ హయంలో తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన విషయాన్ని గత ఏడాది సెప్టెంబర్‌లో సిఎం చంద్రబాబు నాయుడు బయటపెట్టినప్పుడు దేశవ్యాప్తంగా హిందువులు చాలా తీవ్రంగా స్పందించారు. ఈ అపచారానికి, అవినీతికి పాల్పడినవారిని కటినంగా శిక్షించాలని కోరారు.
తమపై బురద జల్లాడానికే చంద్రబాబు నాయుడు ఈ కట్టుకధ చెప్పారని జగన్ & కో గట్టిగా వాదించారు. అన్ని కేసులలాగే దీనిపై కూడా ఓ రెండు మూడు నెలలు చాలా హడావుడి చేసిన తర్వాత హటాత్తుగా అంతా చల్లబడిపోవడంతో ఈ కేసుని కూడా ఆటకెక్కించేసి ఉంటారని అందరూ భావించారు.
ఈవిదంగా ఓ కేసు నమోదు చేసి, మద్యలో సైలంట్ అయిపోతే, ‘ఇదో తప్పుడు కేసు.. రాజకీయ కక్ష సాధింపు కోసమే పెట్టారనే’ వైసీపీ నేతల వాదనలకు బలం చేకూరుతుందనే విషయం కూటమి ప్రభుత్వం గ్రహించినట్లు లేదు.
దాదాపు 9 నెలల విరామం తర్వాత మళ్ళీ ఈ కేసులో చిన్న కదలిక వచ్చింది. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏగా పనిచేసిన అప్పన్నకు సిట్ అధికారులు ఈ కేసులో విచారణకు హాజరు కావాలని కోరుతూ నోటీస్ పంపారు. అప్పన్న చెప్పిన వివరాల ఆధారంగా తర్వాత వైవీ సుబ్బారెడ్డికి, మాజీ ఈవో ధర్మారెడ్డికి కూడా నోటీసులు పంపించవచ్చు.
ఈ కేసులో మొత్తం 15 మందిని నిందితులుగా పేర్కొని వారిలో ఆరుగురిని సిట్ అధికారులు అరెస్ట్ చేసి ప్రశ్నించారు. అరెస్ట్ అయిన వారిలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన తిరుపతిలో వైష్ణవీ డెయిరీ, తమిళనాడులో ఏఆర్ డెయిరీ, ఉత్తరాఖండ్‌లో బోలేబాబా డెయిరీలకు చెందిన వారున్నారు.
మళ్ళీ ఇన్ని నెలల తర్వాత వైవీ సుబ్బారెడ్డి పీఏకి నోటీస్ ఇవ్వడంతో తర్వాత వైవీకి నోటీస్ ఇవ్వడం ఖాయంగానే కనపడుతోంది. కానీ ఇలా నెలలు, ఏళ్ళ తరబడి విచారణ జరుపుతుంటే ఇంత ఘోర అపచారానికి పాల్పడినవారికి ఎప్పుడు శిక్షలు పడతాయి?అసలు ఈ కేసు విచారణ ఎప్పటికైనా పూర్తవుతుందా లేక ఇది కూడా జగన్ ఆక్రమాస్తుల కేసులు, వివేకా కేసు, కోడికత్తి కేసుల్లా ఏళ్ళ తరబడి కొనసాగుతూనే ఉంటుందా?




