తిరుమల లడ్డు కల్తీ వివాదం పై ఇప్పటి వైసీపీ కల్తీ ప్రచారాన్నే నమ్ముకుంటూ ముందుకు సాగుతుంది. ఈ నెయ్యి కల్తీ మీద జరుగుతున్న విచారణ, అందులో బయటపడుతున్న వాస్తవాలు అన్ని ఉన్నవి ఉన్నట్టుగా ప్రచారం చేసే సాహసానికి కూడా వైసీపీ సిద్ధంగా లేదనే చెప్పాలి.
ఈ కేసుని విచారిస్తున్న సిట్ నివేదిక ప్రకారం 2021- 2024 మధ్య తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు తయారీలో వాడిన నెయ్యి అసలు పాల ఉత్పత్తులతో తయారు చేసిన పదార్ధం కాదని, అది పామ్ ఆయిల్, కృత్రిమ రసాయనాల వాడకంతో తయారు చేసిన ఒక పదార్ధం మాత్రమే అని సిట్ నిర్దారించింది.
అందుకు తగ్గట్టే ఈ కేసులో ఇప్పటికి 36 మంది మీద ఛార్జ్ షీట్ కూడా నమోదు చేసింది. అందులో కొంతమంది అరెస్టయ్యి జైల్లో ఉన్నారు. అలాగే ఈ లడ్డు తయారీలో జంతువుల కొవ్వు కూడా కలవలేదంటూ సిట్ తాజా నివేదికలో పొందుపరిచింది.
ఈ నేపథ్యంలో వైసీపీ ఇదంతా పక్కన పెట్టి కేవలం ఈ ఒక్క అంశం మీదే ఫోకస్ చేస్తూ దాన్నే తనకు అనుకూలంగా, తన పార్టీకి సానుకూలంగా మలచుకోవడానికి సిద్దమయ్యింది. తన పార్టీ సోషల్ మీడియాను సైతం సిద్ధం చేసింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించినట్టు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆక్షేపించినట్టుగా తిరుమల శ్రీ వారి లడ్డు తయారీలో జంతువుల కొవ్వు కలవలేదని తేలింది, మరి ఇప్పుడు హిందూ సనాతని అని చెప్పుకునే పవన్ ఏమంటారు.? భక్తుల మనోభావాలతో రాజకీయం చేసిన బాబు ఎం సమాధానం చెప్తారు అంటూ వైసీపీ సోషల్ మీడియా అలర్ట్ అయ్యింది.
అయితే సిట్ జంతువుల కొవ్వు కలవలేదు అని ఎలా అయితే చెప్పిందో అలాగే ఆ నెయ్యి తయారీ పూర్తిగా కృత్రిమం అంటూ కూడా అలాగే ధృవీకరించింది. వైసీపీ మాత్రం తనకు అవసరమైన మేరకే సమాచారాన్ని తీసుకుని దానిని తనకు అనుకూలంగా ప్రచారం చేస్తుంది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టిటిడి కి దాదాపు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా అయినట్టు సిట్ తేల్చి చెప్పింది. అలాగే ఆ మొత్తం సరఫరా విలువ సుమారు 250 కోట్లు అనేది కూడా నిర్దారించింది.
మరి శ్రీవారి లడ్డు తయారీకి వాడే ఒక్క నెయ్యి విషయంలోనే ఈ స్థాయిలో స్కాం జరిగినట్టు సిట్ నివేదిక ఇచ్చినా వైసీపీ మాత్రం ఆ ఒక్క మాట దగ్గరే ఆగిపోవడం అంటే ఇది ఖచ్చితంగా వైసీపీ చేస్తున్న కల్తీ ప్రచారమే అవుతుంది.






