సినీ ప్రపంచంలో ‘అతిలోకసుందరి’గా వెలుగొందిన శ్రీదేవి అనంత లోకాలకు వెళ్ళిన సందర్భంగా హైదరాబాద్ లోని టి.సుబ్బిరామిరెడ్డి కళా పరిషత్ ఆధ్వర్యంలో ‘మా’ సంతాప సభను నిర్వహించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంటే ముందుగా తెలుగు నాట శ్రీదేవి నెంబర్ 1 హీరోయిన్ గా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటి శ్రీదేవి నేటి స్టార్ హీరోల నుండి వర్ధమాన హీరోల వరకు… అందరి ఫేవరేట్ హీరోయిన్ అని వారే స్వయంగా వెల్లడించారు.
కానీ ఇదంతా పేపర్ వరకే పరిమితం. ‘తమ అభిమాన హీరోయిన్ శ్రీదేవి’ అని చెప్పుకునే తెలుగు హీరోలంతా, హైదరాబాద్ లో నిర్వహించిన సంతాప సభను విస్మరించడం శోచనీయం. శ్రీదేవితో నటించిన చిరంజీవి, వెంకటేష్ లు నేరుగా ముంబై వెళ్లి ఆమె పార్థీవదేహాన్ని దర్శించుకున్నారు. మిగిలిన సీనియర్ హీరోలు బాలకృష్ణ, నాగార్జునల నుండి ప్రస్తుత అగ్ర హీరోలు మహేష్, పవన్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులంతా ఈ సంతాప సభను ‘లైట్’గా తీసుకోవడం హర్షించదగ్గ విషయం కాదు.
ఇదేమైనా విశాఖలోనో లేక ముంబైలో నిర్వహించి వెళ్ళలేదు అంటే సమంజసం కాదేమో గానీ, హైదరాబాద్ లో నిర్వహించిన సభకు, అది కూడా ఆదివారం నాడు నిర్వహించినా వెళ్లకపోవడం అనే దానికి సరైన కారణాలు అయితే ఉండబోవు. ఎంత సినిమా షూటింగ్ లో పాల్గొన్నా, సాయంత్ర సమయానికి షూటింగ్ ముగిసిపోతుంది గనుక, వెళ్ళాలన్న తాపత్రయం ఉంటే, ఈ వేడుకకు హాజరు కావడం అనేది కష్టమైన విషయం కాదు. మోహన్ బాబు ఒక్కరే తన గైర్హాజరుకు గల కారణాన్ని తెలిపారు తప్ప, మరే ఇతర కూడా స్పందించలేదు.
బహుశా తాము చేసిన ట్వీట్లు గానీ, ఫేస్ బుక్ సందేశాలు గానీ సరిపోతాయి అనుకున్నారో ఏమో! సదరు హీరోలే సెలవివ్వాలి. సినీ ఇండస్ట్రీకి సంబంధం లేనటువంటి విరాట్ కోహ్లి వంటి వారు స్వయంగా బోనీ కపూర్ ఇంటికి వెళ్లి పరామర్శించి రాగా, సినీ ప్రపంచంతో మమేకమైన వారు శ్రీదేవిని విస్మరించడం ఊహించిన పరిణామం కాదు. కృష్ణంరాజు, నరేష్ వంటి హీరోలు, లెజెండరీ సింగర్ పి.సుశీల వంటి వారు మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.



