తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలుగు సినీ ఇండస్ట్రీ పై చేస్తున్న తాజా ప్రకటనలను పరిశీలిస్తే టాలీవుడ్ రెడ్డి గారిని పక్కన పెట్టిందా.? లేక రెడ్డి గారే సినీపరిశ్రమను పట్టించుకోవడం లేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
పుష్ప – 2 రిలీజ్ తరువాత నుంచి తెలంగాణలో సినిమా టిక్కెట్ రేట్ల పెంపు కానీ, సినిమా ప్రీమియర్ షో లకు అనుమతి కానీ లేదని చెప్పా, ఆ కారణాలతో ఇండస్ట్రీ నుంచి తనను కలిసేందుకు ఎవరిని రావొద్దని చెప్పా, అందుకు సంబందించిన అప్లికేషన్స్ కూడా తనవద్దకి తేవద్దని చెప్పా అంటూ మంత్రి గారు ప్రకటన చేసారు.
అలాగే పుష్ప – 2 తరువాత రిలీజ్ అయిన ఏ సినిమాల విషయంలో ఈ టిక్కెట్ రేట్ల పంచాయితీ ఫైల్స్ తన వద్దకు రాలేదని చెపుతున్నారు మంత్రి గారు. అయితే పుష్ప – 2 తరువాత టాలీవుడ్ నుంచి OG, అఖండ -2, తాజాగా ప్రభాస్ రాజాసాబ్ వంటి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయ్యాయి.
అలాగే ఆ సినిమాలకు తెలంగాణలో కూడా టిక్కెట్ రేట్ల హైక్ అవకాశం లభించింది. ఇలా తెలంగాణలో టికెట్ రేట్లు పెంచడం పై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా అందుకు కోర్ట్ ఈ టికెట్ రేట్ల హైక్ కి వ్యతిరేకంగా తీర్పు కూడా ఇచ్చింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో చాలా సినిమా టికెట్ రేట్లు తెలంగాణలో సైతం పెరిగాయి.
కానీ ఆ పెరుగుడుకి తనకి ఎటువంటి సంబంధం లేదు అనేలా మంత్రి వెంకటరెడ్డి ప్రకటనల బట్టి అర్ధమవుతుంది. అంటే టాలీవుడ్ తమ సినిమా టిక్కెట్ రేట్ల హైక్ కోసం సినిమాటోగ్రఫీ మంత్రిని సంప్రదించకుండానే అనుమతులు పొందుతుందా.? తమ మూవీ అప్లికేషన్స్ మంత్రి ఛాంబర్ కి వెళ్లకుండా పర్మిషన్లతో బయటకొచ్చాయనుకోవాలా.?
అసలు సినిమాటోగ్రఫీ మంత్రి కి తెలియకుండానే టాలీవుడ్ ప్రభుత్వం నుంచి తనకు కావాల్సింది, రావాల్సింది రాబట్టుకుంటుందా.? అసలు నేను సినీ ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడమే మానేశా అంటున్న మంత్రి గారి మాటలు వింటే ఇండస్ట్రీ మంత్రి గారిని పక్కన పెట్టిందా అనిపిస్తుంది.
అలాగే ఈ సంక్రాంతికి మెగాస్టార్ మన శంకర వరప్రసాద్, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ అనగనగా ఒక రాజు, శర్వా నారి నారి నడుమ మురారి వంటి సినిమాలు రిలీజ్ కి సిద్ధమయ్యాయి. ఇందులో చిరు మూవీ ప్రీమియర్లకు సిద్దమయ్యింది. మరి ఈ విషయంలో కూడా రెడ్డి గారికి తెలియకుండానే ఇండస్ట్రీ తన పని తానూ చేసుకుంటూ పోతుందా.?




