డిసెంబర్ 31వ తేదీ వరకు తమ సిమ్ నుండి ‘ఆల్ ఫ్రీ’ అంటూ దేశం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్న రిలయన్స్ జియో సంస్థ ప్లాన్లు, ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఇతర టెలికాం సంస్థలైన ‘ఎయిర్ టెల్ అండ్ కో,’ జియోపై ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో జియోపై ఎలాంటి చర్యలు ట్రాయ్ తీసుకుంటుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ముఖ్యంగా డేటా విషయంలో జియో అందిస్తున్న సౌకర్యం ఇతర టెలికాం సంస్థల పాలిట శాపంగా మారడంతో, ఈ డేటా రద్దవుతుందేమో అన్న అంచనాలు ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. అయితే ‘ఎయిర్ టెల్ అండ్ కో’కు షాక్ ఇచ్చే విధంగా ట్రాయ్, రిలయన్స్ జియోకు క్లీన్ చీట్ ఇచ్చింది. దీంతో సంబరాల్లో జియో సంస్థ వర్గాలు ఉండగా, నిరాశలో ‘ఎయిర్ టెల్ అండ్ కో’ కూరుకుపోయింది.
రిలయన్స్ జియో టారిఫ్ ప్లాన్స్ ఆమోదయోగ్యంగానే ఉన్నాయని ట్రాయ్ స్పష్టం చేయడంతో, ‘ఎయిర్ టెల్ అండ్ కో’ ఆరోపణలు నిరాధారమైనవని తేలిపోయాయి. జియో దెబ్బకు ఇప్పటికే వినియోగదారులంతా ‘ఎంఎన్పీ’ రూపంలో మారిపోతుండగా, కొత్త కొత్త ప్లాన్లను రూపొందించుకుంటున్న ఆయా సంస్థలు, తాజాగా మరికొన్ని ప్లాన్స్ ను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి.



