Bandi-Sanjay-Kumar-KCRటిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో ఓ మూడు నాలుగు రోజులు ప్రకంపనలు సృష్టించినా ఆ తర్వాత టిఆర్ఎస్‌ నేతలందరూ సైలెంట్ అయిపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యంగా దీనిని మునుగోడు ఉపఎన్నికలలో బ్రహ్మాస్త్రంగా బిజెపిపై ప్రయోగిస్తారనుకొంటే, దానిని పక్కన పెట్టేసి ఇతర అంశాల గురించే ఎక్కువగా మాట్లాడటం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక ఈ వ్యవహారంలో బిజెపి అడ్డంగా దొరికిపోయిందనుకొంటే, ఆ పార్టీ నేతలు టిఆర్ఎస్‌పై ఎదురుదాడి చేస్తుండటం మరో విశేషం. ఇక ఈ వ్యవహారంలో ఫోన్‌ ట్యాపింగుల అంశం తెరపైకి రావడం మరో విశేషం.

తంగెళ్ళ శివప్రసాద్ అనే సామాజిక కార్యకర్త హైకోర్టులో ఓ పిటిషన్‌ వేశారు. తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో ఎమ్మెల్యేలవి, రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలవి, చివరికి సామాన్య ప్రజల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5(2) ప్రకారం ఫోన్‌ ట్యాపింగ్ చేయడం నేరమని పిటిషన్లో పేర్కొన్నారు.

కొందరు ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేయడం ద్వారానే ఫామ్‌హౌస్‌లో ముగ్గురు నిందితులను పట్టుకొనేందుకు పోలీసులు వలపన్నగలిగారని పిటిషనర్‌ పేర్కొనన్నాడు. ఈ వ్యవహారంలో ప్రతివాదులుగా రాష్ట్ర హోమ్ శాఖ కార్యదర్శి, డిజిపి, సైబరాబాద్ సిపిని ప్రతివాదులుగా చేర్చారు. హైకోర్టులో పిటిషన్‌ వేయడంతో పాటు ఆయన కేంద్ర ఎన్నికల కమీషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. హైకోర్టు, ఈసీ రెండూ ఆయన పిటిషన్లను విచారణకు స్వీకరించాయి.

మరోపక్క తెలంగాణ బిజెపి వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌ఛుగ్‌ నేతృత్వంలో బిజెపి నేతలు కూడా కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఇదే ఫిర్యాదు చేశారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిజెపి నేతల ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేయించిందని, బిజెపి అభ్యర్ధి బ్యాంక్ అకౌంట్లను కూడా రహస్యంగా పరిశీలిస్తోందని తరుణ్‌ఛుగ్‌ ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టిఆర్ఎస్‌ నేతలు ఈసీకి చేసిన పిర్యాదునే ఇందుకు సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఈ ఫోన్‌ ట్యాపింగ్, బ్యాంక్ ఖాతాలను రహస్యంగా పరిశీలించడంపై ఫిర్యాదు చేసి తెలంగాణ ప్రభుత్వంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

కనుక బిజెపి కోసం తవ్విన గోతిలో టిఆర్ఎస్‌ పార్టీయే పడిందా లేక టిఆర్ఎస్‌ వలలో బిజెపి చిక్కుకొందా?ఇంతకీ దీనిలో చివరికి బకరా ఎవరు?అనే సందేహాలు కలుగుతాయి.

అయితే ఈ వ్యవహారంలో టిఆర్ఎస్‌, బిజెపిల మద్య సెటిల్‌మెంట్ కోసం తెర వెనుక చర్చలు జరుగుతున్నాయని, తెలంగాణ మాజీ గవర్నర్‌ నరసింహన్ మద్యవర్తిత్వం వహిస్తున్నారని టిడిపి మహిళా నాయకురాలు గౌతు శిరీష మరో కొత్త విషయం బయటపెట్టారు. అందుకే కేసీఆర్‌ టిఆర్ఎస్‌ను సైలెంట్ మోడ్‌లో ఉంచారా లేక ఇది ప్రళయం ముందు నిశబ్ధమా అనేది త్వరలోనే తెలుస్తుంది.