ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అవ్వని కారణంగా కేంద్రంపై అవిశ్వాసతీర్మాణం పెట్టిన వైకాపా, టీడీపీలకు తెరాస అడ్డుపడుతుంది. సభ ఆర్డర్ లో లేకపోతే అవిశ్వాసం పరిగణలోకి తీసుకోవడం కుదరదు అని స్పీకర్ వంకలు పెడుతుంటే కేంద్రానికి సాయం అన్నట్టుగా తెరాస ఎంపీలు సభ మధ్యలోకి వెళ్లి గొడవ చేసి వాయిదా పడేలా చేస్తున్నారు.
తెరాస వైఖరిపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతున్న తరుణంలో అవిశ్వాస తీర్మానంపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన భువనగిరి పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ… అవిశ్వాస తీర్మానం పిల్లలాట కాదన్నారు. పక్కింట్లో పెళ్లి అయితే మా ఇంట్లో రంగులు వేసుకోవాల్సిన అవసరంలేదు… అని నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు.
తమ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్‌లో పోరాడతామన్నారు. ప్రజల ఎజెండాతోనే టీఆర్‌ఎస్ ముందుకెళ్తుందన్నారు. అవిశ్వాస తీర్మానం రాజకీయ స్వార్థంలో భాగమేనని, మాతో చర్చించకుండా అవిశ్వాసం పెడితే ఎలా మద్దతిస్తామని ఎంపీ నర్సయ్యగౌడ్ పేర్కొన్నారు.
అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కేసీఆర్ ఈ మధ్య జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీల మద్దత్తు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పక్క రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయన్ని ప్రశ్నించకపోతే కేసీఆర్ మీద జాతీయ స్థాయిలో ఎలా నమ్మకం ఏర్పడుతుంది? పక్కనే ఉన్న సాటి తెలుగు రాష్ట్రాన్ని పట్టించుకోకుండా దేశాన్ని ఉద్ధరిస్తాం అని చెప్తే నమ్మే పరిస్థితి ఉంటుందా?



