అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుంటిసాకులతో సుంకాలు పెంచేసి భారత్‌ని లొంగదీసుకోవాలనుకున్నారు. అలాగే ప్రపంచదేశాలను కూడా. ట్రంప్ ఒత్తిళ్ళకు తలొగ్గి రష్యా నుంచి చవకగా వస్తున్నా చమురు కొనుగోలు తగ్గించుకోక తప్పలేదు. ట్రంప్‌ని ప్రసన్నం చేసుకునేందుకు అమెరికాతో సుమారు రూ.800 కోట్లు విలువగల ఆయుధాలు కొనుగోలు ఒప్పందం చేసుకోక తప్పలేదు.
కానీ ట్రంప్ పుణ్యామాని భారత్‌తో పలుదేశాలకు అమెరికా మీద అతిగా ఆధార పడరాదనే జ్ఞానోదయం బాగా అయ్యింది. అందువల్ల అన్ని దేశాలు అమెరికాకు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతకడం మొదలుపెట్టాయి. భారత్ వెతుకలాట ఫలితమే ఇటీవల యూరప్‌తో జరిగిన వాణిజ్య ఒప్పందం. దీని వలన భారత్, యూరప్ దేశాలు రెండూ లబ్ది పొందుతాయి.
భారతీయ ఉత్పత్తులకు, విద్యార్ధులకు, ఉద్యోగులకు అమెరికా తలుపులు వేసేస్తుండటంతో ఈ ఒప్పందం ద్వారా యూరప్ తలుపులు తెరుచుకున్నాయి. అలాగే ఇకపై యూరప్ దేశాలు కూడా తమ ఉత్పత్తులను 150 కోట్లు జనాభా కలిగిన అతిపెద్ద భారత్ మార్కెట్‌లో అమ్ముకోవచ్చు.
ట్రంప్ దెబ్బలతో గత కొన్ని నెలలుగా డీలా పడిన స్టాక్ మార్కెట్ ఈ ఒప్పందం తర్వాత మళ్ళీ మెల్లగా పుంజుకోవడంతో భారత్ ప్రయత్నాలు ఫలిస్తున్నాయని స్పష్టమవుతోంది.
అయితే ట్రంప్ పుణ్యమాని భారత్ ఇంకా అనేక గుణపాఠాలు నేర్చుకుంది. ముందుగా దేశీయ మార్కెట్‌ను ప్రోత్సహిస్తే కొంతవరకు నష్ట నివారణ జరుగుతుందని గ్రహించి దసరా దీపావళి పండుగళ ముందు పలు ఉత్పత్తులపై భారీగా జీఎస్టీ తగ్గించింది. దాంతో ప్రజలు భారీగా షాపింగ్ చేశారు. దాంతో భారతీయ మార్కెట్ కొంత కోలుకుంది. కానీ పూర్తిగా కోలుకోవడానికి అది ఒక్కటే సరిపోదని కేంద్రానికి తెలుసు.
కనుక బూజుపట్టిన టారీఫ్ విధానాన్ని కూడా సరిచేసింది. ఈ మార్పుల వలన కూడా మళ్ళీ భారతీయ స్టాక్ మార్కెట్, ఆర్ధిక వ్యవస్థ, పరిశ్రమలు, పెట్టుబడులు మళ్ళీ పుంజుకుంటున్నాయి. పాత టారీఫ్ విధానంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులు చేర్పులు ఇవే.







