అమెరికన్ ప్రజలు డొనాల్డ్ ట్రంప్‌కే మళ్ళీ అధికారం కట్టబెట్టారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో 521 ఫలితాలు వెలువడగా వాటిలో డొనాల్డ్ ట్రంప్ 295 గెలుచుకొని తిరుగులేని మెజార్టీతో విజయం సాధించి మళ్ళీ అమెరికా అధ్యక్షుడు కాబోతున్నారు.
డెమొక్రాట్ అభ్యర్ధి కమలా హారిస్ ఆయనకు గట్టి పోటీ ఇచ్చారు కానీ ట్రంప్ ధాటికి తట్టుకోలేక ఓటమి పాలయ్యారు. ఆమె 226 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకున్నారు. ఆమె తన ఓటమిని అంగీకరించి ట్రంప్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
కనుక మళ్ళీ అమెరికాలో, ప్రపంచ దేశాలలో ‘ట్రంప్ శకం’ మొదలయ్యింది. ట్రంప్ గెలుపుకి జో బైడెన్ అనుసరించిన ద్వంద విధానాలే ప్రధాన కారణమని చెప్పవచ్చు.
ఓ పక్క శాంతి ప్రవచనాలు వల్లిస్తూనే యుద్ధంలో ఇజ్రాయెల్‌తో చేతులు కలపడం, రష్యాని నిలువరించే ప్రయత్నంలో ఉక్రెయిన్‌కు భారీగా నిధులు, ఆయుధాలు అందించారు.
ఓ పక్క దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంటే పట్టించుకోకుండా, అమెరికన్ల కష్టార్జితాన్ని బైడెన్ ప్రభుత్వం ఈవిదంగా దూబరా చేస్తుండటాన్ని సగటు అమెరికన్ జీర్ణించుకోలేక, బైడెన్ విధానాలనే కొనసాగించాలనుకున్న కమలా హారిస్‌ని వద్దనుకొని ఉండవచ్చు.
ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ అనేక యుద్ధాలు చేస్తున్నాయి. తాను అధ్యక్షుడినైతే వారం రోజులలోగా యుద్ధాలు ఆపేస్తానని డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలలో హామీ ఇచ్చారు. తనకు అమెరికా దేశం, ప్రజల కంటే మరేదీ ముఖ్యం కాదని ట్రంప్ చెపుతుంటారు.
గతంలో ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు, ఇతర దేశాల భద్రత కోసం అమెరికన్ల కష్టార్జితం వృధా చేయదలచుకోలేదని నిష్కర్షగా చెప్పేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లతో పోరాడుతూ అమెరికన్ సైనికులు ప్రాణాలు పోగొట్టుకోనవసరం లేదంటూ సైనికులను వెనక్కు రప్పించేశారు. కనుక యుద్ధాలకు దూరంగా ఉంటాననే ట్రంప్ మాటలను అమెరికన్లు విశ్వసించి గెలిపించి ఉండవచ్చు.
అయితే ప్రపంచదేశాలపై ఆధిపత్యం చలాయించాలని కోరుకునే అమెరికన్ల సహజగుణం ట్రంప్‌ని యుద్ధాలకు దూరంగా ఉంచుతుందా లేదా రాబోయే రోజుల్లో చూస్తాము.




