మన దేశంలో విశ్వశాంతి, లోక కల్యాణం కోరుకుంటూ ప్రత్యేక పూజలు, యజ్ఞాలు, యాగాలు నిర్వహిస్తుంటారు. కానీ అమెరికా విధానం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ప్రపంచంలో శాంతి నెలకొల్పడానికి తరచూ ఏదో ఓ దేశంతో యుద్ధం చేస్తూనే ఉంటుంది.
ఇరాన్, ఇరాక్, సిరియాలపై బాంబుల వర్షం కురిపించి శాంతి స్థాపనకు కృషి చేస్తునట్లుగానే, మొన్న వెనిజులాపై కూడా దాడి చేసి ఆ దేశాధ్యక్షుడుని ఎత్తుకుపోయి అయన దుష్ట పాలన నుంచి ఆ దేశ ప్రజలను ట్రంప్ కాపాడారు. త్వరలో గ్రీన్ ల్యాండ్ (డెన్మార్క్), కొలంబియ, మెక్సికోలో కూడా ‘శాంతి స్థాపన’ చేస్తామని ట్రంప్ ప్రకటించారు.
ట్రంప్ మొదటిసారి అమెరిక అధ్యక్ష భాధ్యతలు చేపట్టినప్పుడు తన దేశ ప్రజల కష్టార్జితంతో, తన సైనికుల ప్రాణాలను పణంగా పెట్టి ప్రపంచదేశాలను కాపాడాల్సిన అవసరం తమకు లేదని ఖరాఖండీగా చెప్పేశారు. అందుకే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకున్నారు.
ఈ నేపధ్యంలో చూస్తే రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ట్రంప్‌లో ఇంత మార్పు రావడం విశేషమే కదా?
అయన కోరుకుంటున్న ప్రపంచ శాంతికి చాలా నిర్వచనాలున్నాయి. నోబుల్ కమిటీకి అవి అర్థం కానందునే ఆయనకు శాంతి బహుమతి ఈయలేదు.
కానీ ట్రంప్ తమ దేశంపై ఎందుకు దాడి చేసి అధ్యక్షుడుని ఎత్తుకుపోయారో బాగా అర్థం చేసుకున్నారు ఆ దేశ విపక్ష నేత, నోబుల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కోరీనా మచాడో.
అందుకే ఆమె అమెరికా వచ్చి వైట్‌హౌస్‌లో ట్రంప్‌ని కలిసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. తనకు లభించిన ఆ ప్రతిష్టాత్మకమైన అవార్డుని ట్రంప్‌కి ఇచ్చేశారు!
ఏడు యుద్ధాలు ఆపినందుకు నోబుల్ శాంతి బహుమతిని ఆశించి భంగపడిన ట్రంప్ చేతికి అది ఈవిధంగా రావడం విశేషమే కదా? ఇందుకు కృతజ్ఞతగా ఆమెను వెనిజులా అధ్యక్షురాలుగా నియమించినా ఆశ్చర్యం లేదు!
వెనిజులా నుంచే ట్రంప్‌కు నోబుల్ బహుమతి లభించినందున, ఇకపై శాంతి ప్రయత్నాలు ముమ్మురం చేయడం ఖాయమే. గ్రీన్ ల్యాండ్‌తో మొదలుపెట్టబోతున్నామని ఇప్పటికే ట్రంప్ చెప్పేశారు కూడా. కనుక ఆయన ప్రపంచ శాంతి నిర్వచానాలను మనమే అర్థం చేసుకొని సర్దుకుపోతుండాలి. తప్పదు!






