విజయ్ దళపతి సెకండ్ ఇన్నింగ్స్… ఎలా ఉంటుందో?

Vijay Dalapathy Politics

కోలీవుడ్‌ సూపర్ స్టార్ విజయ్ దళపతి సినీ పరిశ్రమ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన నటించిన ‘జన నాయగన్’ జనవరి 9న విడుదలవుతోంది. ఇదే తన చివరి సినిమా అని స్పష్టం చేశారు. తమిళనాడు రాజకీయాలలో పాల్గోనేందుకే అయన సినీ పరిశ్రమని వీడుతున్నారు. రాజకీయాలలో రాణించాలంటే పూర్తి సమయం కేటాయించడం చాలా అవసరమని విజయ్ భావిస్తున్నారు.

గత ఏడాది ఫిబ్రవరి 2న ‘తమిళ వెట్రి కజగం’ పార్టీని స్థాపించారు. కానీ ఈ ఏడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో భారీ ర్యాలీ నిర్వహించగా తొక్కిసలాట జరిగింది. దానిలో ఏకంగా 40 మంది చనిపోయారు.

ADVERTISEMENT

అది తన జీవితంలోనే అతిపెద్ద షాక్ అని చెప్పారు. ఆ ఘటన తర్వాత జరిగిన రాజకీయాల దెబ్బకి ఆయన వెనకడుగు వేస్తారని చాలా మంది అనుకున్నారు. కానీ అప్పుడు జరిగిన రాజకీయాల నుంచి కూడా విజయ్ అనేక రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. ఇకపై పూర్తిగా రాజకీయాలలో ఉండాలని నిర్ణయించుకున్నారు.

తమిళనాడులో జయలలిత, కరుణానిధి ఉన్నంతకాలం అధికార మార్పిడి ఆ రెండు పార్టీల మధ్యనే సాగేది. కాంగ్రెస్‌, బిజేపి, తమిళ సినీ నటులు ఎవరు ఎంత ప్రయత్నం చేసినా అధికారం దక్కించుకోలేకపోయారు. జయలలిత, కరుణానిధిళ శకం ముగిసేటప్పటికీ స్టాలిన్ డీఎంకే పార్టీలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. కనుక తండ్రి మరణించగానే పార్టీ ఆయన చేతికి వచ్చింది. తమిళనాడు ప్రజలు కూడా ఆయన్ని కరుణానిధి వారసుడుగా అంగీకరించి అధికారం కట్టబెట్టారు.

ఇదే సమయంలో జయలలిత ఆకస్మిక మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీలో పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. వారి పార్టీతో పొత్తుపెట్టుకున్న బిజేపి వారిరువురినీ పరోక్షంగా నియంత్రిస్తోంది.

కనుక ఇప్పుడు విజయ్ పార్టీ ప్రధానంగా స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీతోనే పోటీపడాల్సి ఉంటుంది. ఎన్నికలకు ఇంకా చాల సమయం ఉండగానే విజయ్ సినిమాలకు స్వస్తిపలికి రాజకీయాలలోకి వచ్చేస్తున్నారు. కనుక ఆలోగా పార్టీని బలోపేతం చేసుకొని ప్రజలకు దగ్గరవగలిగితే వచ్చే ఎన్నికలలో డీఎంకే పార్టీతో పోటీ పడగలుగుతారు. లేకుంటే చిరంజీవిలా రాజకీయాలకు స్వస్తి పలికి మళ్ళీ సినీ పరిశ్రమలోకి రాక తప్పదు.

సినీ పరిశ్రమలో విజయవంతంగా ఫస్ట్ ఇన్నింగ్స్ పూర్తి చేసిన విజయ్ దళపతి, తమిళనాడు రాజకీయాలలో మొదలుపెడుతున్న ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా విజయం సాధిస్తారా లేదా అనేది ఎన్నికలొస్తే కానీ తెలియదు.

ADVERTISEMENT
Latest Stories