Vijay Deverakonda Thums Upమొన్నటివరకు మహేష్ బాబు చేతిలో ఉన్న థమ్సప్ బాటిల్, ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలోకి వెళ్ళింది. యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న విజయ్ కొత్త థమ్సప్ యాడ్ సోషల్ మీడియాను చుట్టేసింది. ‘సాఫ్ట్ డ్రింక్ కాదు తమ్ముడు ఇది తుఫాన్’ అంటూ విజయ్ వినిపించిన స్లోగన్ క్రేజీగా మారిపోయింది.

మరి మహేష్ బాబు స్థానాన్ని విజయ్ భర్తీ చేసినట్లేనా? అంటే ఖచ్చితంగా అనే సమాధానమే వస్తోంది. జాతీయ స్థాయిలో పాపులారిటీ ఉన్న మహేష్ బాబును మైమరిపించే విధంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒకవేళ ఏమైనా తేడా కొడితే, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ కు గురి కావాల్సి ఉంటుంది.

కానీ విజయ్ చేసిన యాడ్ ఏ హాలీవుడ్ సినిమా యాక్షన్ కు తగ్గని రీతిలో ఉంది. నిజానికి మహేష్ తో కూడా మాంచి యాక్షన్ సన్నివేశాలతో థమ్సప్ యాడ్లను చిత్రీకరించేవారు, ఫ్యాన్స్ కు అవే పెద్ద క్రేజీగా మారేవి. ఇపుడు విజయ్ దేవరకొండతో అదే విధంగా యాక్షన్ సన్నివేశాలతో రూపొందించిన యాడ్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

మహేష్ – విజయ్ లకు ఈ యాడ్ విషయంలో ఓ వ్యత్యాసం అయితే ఉంది. మహేష్ ఛరిష్మా థమ్సప్ కు చాలా ఉపయోగపడగా, విజయ్ కు మాత్రం థమ్సప్ యాడ్ ఉపయోగపడనుంది. త్వరలో బాలీవుడ్ నాట ఎంట్రీ ఇవ్వబోతున్న విజయ్ కు, ఈ థమ్సప్ యాడ్ కాంపెయిన్ ఎంతగానో ఉపయోగపడనుంది. అలాగే మహేష్ – రణవీర్ ల మల్టీస్టారర్ యాడ్ మాదిరి రానున్న కాలంలో విజయ్ కూడా బాలీవుడ్ లో క్రేజీ నటులతో ఈ థమ్సప్ యాడ్ లో నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.