సినీ నటులు, రాజకీయ నాయకుల పట్ల అభిమానం మంచిదే కానీ అది వీరాభిమానంగా మారినప్పుడే సమస్యలు మొదలవుతాయి. ఆ అభిమానంతోనే వారి సినిమాలకు, సినీ కార్యక్రమాలకు, సభలు, సమావేశాలు, ర్యాలీలకు ప్రజలు వెళుతుంటారు. అది వారికి చాలా సంతోషం కలిగించవచ్చు.
అంతమంది అభిమానులు, ప్రజలు తమ వెనుక ఉన్నారని వారు కూడా ఆనందించవచ్చు. కానీ ఈ అభిమానం లేదా రాజకీయ చైతన్యం వలన మనుషుల ప్రాణాలు పోకూడదు కదా?
ప్రాణాలు పోయేంత వీరాభిమానం, రాజకీయ చైతన్యం అవసరమా? అని మరోసారి ప్రశ్నించుకోవలసిన అవసరం ఏర్పడింది శనివారం తమిళనాడులోని కరూర్ పట్టణంలో జరిగిన విషాదం చూస్తున్నప్పుడు.
కోలీవుడ్ నటుడు విజయ్ టీవీకే సభ త్రొక్కిసలాటలో 39 మంది చనిపోగా మరో 50 మందికి పైగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు.
“నా హృదయం ముక్కలైంది. ఇది భరించలేని బాధ. నేను చాలా దుఃఖంలో ఉన్నాను. నా బాధని పదాలలో వ్యక్తం చేయలేను. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాడ సానుభూతి… ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను,” అంటూ విజయ్ నాలుగు ముక్కలో తేల్చేశారు.
ప్రభుత్వం కూడా నష్టపరిహారం ప్రకటించి, కమీషన్ ఏర్పాటు చేసి బాధ్యులపై కటిన చర్యలు తీసుకుంటామని పద్దతిగా స్పందించింది.
వారి మరణాలకు ఆయనే కారకుడని నిందించలేము. కాదని కూడా చెప్పలేము. సినీ నటుల సభలు, ర్యాలీలలో ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని తెలిసి ఉన్నప్పుడు సదరు సినీ నటులు, సభ నిర్వాహకులు, పోలీసులు తగు ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ చేయలేదని ఈ మరణాలు చెపుతున్నాయి.
దీనిలో సినిమాలు, రాజకీయాలు రెండూ ముడిపడి ఉండటంతో ఈ వ్యవహారం తప్పక నాటకీయ మలుపులు తిరుగుతుంది.
దీంతో టీవీకే పార్టీ, దాని అధినేత విజయ్, అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకే, ఇతర పార్టీల మద్య రాజకీయ చదరంగం మొదలవుటుంది. ఈ ఆటలో ఎవరో ఒకరు పైచేయి సాధిస్తారు. అధికారం చేజిక్కించుకుంటారు.
కానీ ఈ ర్యాలీకి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నవారి కుటుంబాలు ఈ శోకం భరించక తప్పదు. వారిపై ఆధారపడి జీవిస్తున్నట్లయితే ఆ కుటుంబాలు రోడ్డున పడతాయి కూడా.
ఈ సినీ అభిమానం లేదా రాజకీయ చైతన్యంతో ప్రాణాలు పోగొట్టుకొని, కుటుంబంలో అందరి జీవితాలను నాశనం చేసుకోవడం వివేకమా… అవసరమా? అని సభలు, ర్యాలీలకు బయలుదేరే ప్రతి ఒక్కరూ ఆలోచించుకుంటే మంచిది.




