ఈ నెల 11,12 తేదీలలో ప్రధాని నరేంద్రమోడీ విశాఖలో పర్యటించబోతున్నారు. విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు, రోడ్ల నిర్మాణ పనులు వంటి ఏడెనిమిది కార్యక్రమాలలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ విశాఖకు వస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. ఈ అభివృద్ధి పనుల విలువ సుమారు రూ.10,475 కోట్లు అని తెలిపారు. ఆంధ్రా యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారీ బహిరంగసభలో ఆయన పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి జిల్లా అధికారులతో కలిసి ఈరోజు యూనివర్సిటీ మైదానం వద్దకు వెళ్ళి స్వయంగా పరిశీలించారు. అనంతరం వారితో సభ ఏర్పాట్ల గురించి చర్చించారు. ప్రధాని మోడీ సభకు సుమారు లక్షమంది జనసమీకరణ చేయబోనునట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ పర్యటనలో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కూడా స్పష్టత వస్తుందని భావిస్తున్నామని తెలిపారు.
ఉత్తరాంద్ర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని నరేంద్రమోడీ వస్తున్నందున ఇది పార్టీలకు అతీతమైన అధికారిక కార్యక్రమమని, కనుక ప్రధానికి ఘనస్వాగతం చెప్పి, ఆయన కార్యక్రమాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని విజయసాయి రెడ్డి చెప్పారు.
ప్రధాని రాష్ట్రానికి వస్తే ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు సాదరంగా స్వాగతం, వీడ్కోలు పలకాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అలాగే ప్రధాని అధికారిక కార్యక్రమాలలో ముఖ్యమంత్రి, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొనడం కూడా అవసరమే.
అయితే బిజెపి, జనసేనల కంటే వైసీపీయే ఎక్కువ హడావుడి పడుతుండటమే విశేషం. కారణం అందరికీ తెలిసిందే. అప్పులు, కేసుల వ్యవహారాలు పక్కన పెడితే విశాఖను రాజధానిగా చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది కనుక ప్రధాని మోడీ చేత విశాఖలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయించినట్లయితే కేంద్ర ప్రభుత్వం కూడా విశాఖనే రాజధానిగా పరిగణిస్తోందని వైసీపీ నేతలు గట్టిగా చెప్పుకోవడానికి ఉంటుంది.
మాయాబజార్ సినిమాలో కౌరవులను దండించడానికి ఆగ్రహంగా వచ్చిన బలరాముడు వారి సత్కారాలకు, సన్మానాలకు పొంగిపోయి తన కుమార్తె శశిరేఖను ఉత్తరకుమారుడుకిచ్చి పెళ్ళి చేసేందుకు అంగీకరించినట్లే, ప్రధాని మోడీకి విశాఖలో ఘనంగా స్వాగతం పలికి, సభను విజయవంతం చేయగలిగితే, ఆయన కూడా తాను అమరావతికి శంకుస్థాపన చేశాననే విషయం మరిచిపోయి విశాఖలో రాజధానికి శంకుస్థాపన చేస్తారేమో అనే అత్యాశ కూడా వైసీపీకి ఉండి ఉండవచ్చు. మరి వైసీపీ చేస్తున్న ఈ హడావుడిపై బిజెపి, జనసేనలు ఏమంటాయో చూడాలి.



