తెలంగాణలో కాంగ్రెస్, బిజేపి, బీఆర్ఎస్ మూడు పార్టీలు ఉండగా రాజకీయ శూన్యత ఉందంటూ కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీని నేడు ప్రకటించారు. అలాగే ఏపీలో కూడా రాజకీయ శూన్యత ఉందని చెప్తున్నారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి. అంటే కొత్త పార్టీ పెట్టుకునే ఆలోచన ఉన్నట్లు అర్ధమవుతుంది.
జగన్ హయంలో మద్యం కుంభకోణం జరగడం నూటికి నూరు శాతం నిజమేనని గట్టిగా చెప్పిన వ్యక్తి విజయసాయి రెడ్డి. గతంలో అయన వైసీపీలో నం:2గా ఉండేవారు. కనుక ఆయన ఇంట్లోనే ఈ కుంభకోణం ప్లానింగ్ అంతా జరిగిందని సిట్ అధికారులు ఈ కేసులో అయన పేరు కూడా జోడించారు.
కానీ తన చేతికి మద్యం చుక్క అంటలేదని, తాను కేవలం నిమిత్తమాత్రుడినని చెప్పుకుంటున్నారు… తాటి చెట్టు కింద కూర్చొని ‘పాలు తాగుతున్నా నమ్మండి’ అన్నట్లు!
ఈ కేసు నుంచి ఊరట లభిస్తుందనే హామీతోనే గత ఏడాది ఆయన హటాత్తుగా వైసీపీకి రాజకీయ సన్యాసం తీసుకున్నారని అప్పుడే ఊహాగానాలు వినిపించాయి. వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే బిజేపిలో చేరితే అందరికీ అనుమానం వస్తుంది. కనుక ముందుగా సన్యాసం తీసుకొని తర్వాత తాపీగా చేరుతారని చాలా మంది ఊహించారు.
అంతా సాఫీగా సాగుతోందనుకుంటే ఈడీ అధికారులు నిన్న తన ఇంట్లో కూడా సోదాలు నిర్వహించడం ఆయనకు పెద్ద షాక్ అనే చెప్పాలి.
కనుక రాజకీయాలకు దూరంగా ఉండటం ఎంత ప్రమాదకరమో గ్రహించినట్లున్నారు. ఈ ఏడాది జూలైలో మళ్ళీ రాజకీయాలలోకి వస్తానని ప్రకటించారు. అలాగే మీడియా రంగంలోకి కూడా ప్రవేశించబోతున్నట్లు తెలిపారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరుని తప్పు పడుతూనే రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని కొత్త పార్టీ ఏర్పాటు అవసరమని అన్నారు.
అంటే సొంత మీడియా, సొంత పార్టీతో రాబోతున్నట్లు భావించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఆయన సిఎం చంద్రబాబు నాయుడుపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
“ఇప్పుడు ఆయన వయసు 80కి దగ్గర పడుతోందని, కూడబెట్టిన లక్షల కోట్లు తనతో వెంట తీసుకుపోతారా? కనీసం పోయేలోగా రాష్ట్రానికి, ప్రజలకు కాస్త మంచి చేసిపోతే కనీసం ప్రజలు గుర్తుంచుకుంటారు. కానీ ఇంకా అవినీతిలో మునిగి తేలుతున్నారు. మళ్ళీ నేను రాజకీయాలలో వచ్చాక చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరినీ ఎండగడతానుమ,” అని విజయసాయి రెడ్డి హెచ్చరించారు.
అంటే ఆయనకు ఈ కేసు, అక్రమాస్తుల కేసుల నుంచి ఉపశమనం లభించడం లేదు కనుక బిజేపిలోకి వెళ్ళి ప్రయోజనం ఉండదని భావిస్తున్నారేమో? కనుక బిజేపిలో చేరే బదులు సొంత మీడియా, సొంత పార్టీతో కేసులను ఎదుర్కోవాలని భావిస్తున్నారేమో?




