ఏపీ మద్యం స్కాంలో మాజీ ఎంపీ విజయసాయిని ఈడీ అధికారులు నిన్న హైదరాబాద్‌లో తమ కార్యాలయంలో ఏడు గంటల సేపు ప్రశ్నించారు. అనంతరం ఆయన బయట మీడియాతో చాలా విషయాలు మాట్లాడారు.
ఆ వీడియోలు ఇప్పటికే న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియాలోకి వచ్చేశాయి. కనుక వాటన్నిటి గురించి ఇప్పుడు చర్చ అనవసరం.
కానీ అయన చెప్పిన కొన్ని విషయాలను లోతుగా పరిశీలిస్తే వాటిలో ఆయన భవిష్య కార్యాచరణ కనిపిస్తుంది.
తను వైసీపీని, జగన్‌ని వీడటానికి ప్రధాన కారణం నం.2 స్థానం నుంచి తప్పించడమే అన్నారు. మద్యం స్కాంలో వందల కోట్లు చేతులు మారినమాట వాస్తవమే కానీ జగన్‌కి తెలిసి ఉండకపోవచ్చని అన్నారు. ఏడాది పూర్తయినందున, రాజకీయ సన్యాసం విరమించి మళ్ళీ రాజకీయాలలోకి వస్తానని చెప్పారు. తాను బిజేపిలోకి వెళ్తానా లేక తిరిగి వైసీపీలోకి వెళ్తానా అనే విషయం ఇప్పుడే చెప్పలేనన్నారు.
ఇప్పుడీ మాటలన్నీ కలిపి చూస్తే, జగన్ తనకు మళ్ళీ నం.2 స్థానం ఇస్తే విజయసాయి రెడ్డి మళ్ళీ వైసీపీలో చేరేందుకు సిద్ధమని హింట్ ఇచ్చినట్లు భావించవచ్చు. అందుకే మద్యం స్కాంలోజగన్కి క్లీన్ చిట్ ఇచ్చినట్లు భావించవచ్చు.
అందుకే ఓ శ్రేయోభిలాషిగా కూటమి ప్రభుత్వం ఏవిధంగా దూసుకుపోతోందో వివరించి, దానిని సమర్ధంగా ఎదుర్కొనే విధానం ఇది కాదని చెప్పారు. తనని వైసీపీలో తీసుకుని మళ్ళీ నం.2 ఇస్తే కూటమిని ఎలా ఎదుర్కోవాలో ఉపదేశిస్తానని విజయసాయి రెడ్డి ఆఫర్ ఇస్తున్నట్లు భావించవచ్చు.
కానీ నేటికీ విజయసాయి రెడ్డి బిజేపి, వైసీపీల మద్య ఎందుకు ఊగిసలాడుతున్నారంటే, బిజేపిలో చేరితే రక్షణ కవచం లభిస్తుంది. చేరకపోతే ఇలాగే ఈడీ వెంటపడుతుంటుంది. అదే వైసీపీలో చేరితే ఏ-1, ఏ-2ల కేసులని క్లబ్ చేసుకుంటూ ఇద్దరూ ఒకే మాట మీద సాగవచ్చు. కానీ రెంటిలో వైసీపీలో చేరేందుకే అయన ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లనిపిస్తోంది.
ప్రస్తుతం జగన్‌కి సజ్జల వంటివారు శల్య సారధ్యం చేస్తుండటం వల్లనే ఈ రప్పారప్పాలు, మెడికల్ కాలేజీలతో గుడ్డిగా ముందుకు సాగుతున్నారు. తన సలహాలు, సహాయం లేకపోతే పార్టీ ఎలా నడుస్తుందో జగన్‌కి అర్ధమయ్యేలా చేయడానికే విజయసాయి రెడ్డి ఏడాది సన్యాసం చేశారని చెప్పవచ్చు. ఇలాంటి క్లిష్ట సమయంలో అటు ఢిల్లీలో చక్రం తిప్పగల సమర్ధుడు, ఇటు రాష్ట్ర రాజకీయాలలో, పార్టీలో కూడా చక్రం తిప్పగల సమర్దుడైన, నమ్మకస్తుడైన ఈ ‘పాలేరు’ ఇస్తున్న ఈ ఆఫర్‌ని జగన్ తీసుకోవడమే మంచిది.
కానీ ఆయనని వైసీపీలోకి తీసుకొని నం.2 ఇవ్వాలంటే ముందుగా ఆయనకు ఎసరు పెట్టిన సజ్జల రామకృష్ణా రెడ్డి తదితరులందరినీ జగన్ వదులుకోవాల్సి ఉంటుందనే షరతు కూడా ఆయన మాటలలో ఇమిడి ఉంది. కనుక బంతి జగన్ కోర్టులో వేసి విజయసాయి రెడ్డి ఎదురుచూస్తున్నారనుకోవచ్చు. జగన్ వద్దనుకుంటే ప్లాన్-బీగా బిజేపి ఉండనే ఉంది.






