జగన్‌ కోసం ప్యాలస్‌ కట్టుకుంటే… అదే విశాఖ అభివృద్ధి!

roja-vizag

ఋషికొండ ప్యాలస్‌ గురించి టిడిపి నేతలు ఒకటి రెండు రోజులు మాట్లాడి వదిలేశారు. కానీ వైసీపి నేతలు మాత్రం పోటీలు పడుతూ దాని గురించి మాట్లాడుతూ ఈ వ్యవహారం గురించి తెలియని ప్రజలకు కూడా తెలిసేలా చేస్తూ తమని తామే రోడ్డున పడేసుకుంటున్నారు.

రాష్ట్రంలో ప్రధాన పర్యాటక ఆకర్షణ కేంద్రాలలో విశాఖ నగరం కూడా ఒకటి. పైగా జగన్‌ ప్రభుత్వం విశాఖని రాజధానిగా చేయాలనుకుంది కూడా.

ADVERTISEMENT

కనుక జగన్‌ ప్రభుత్వం ఈ 5 ఏళ్ళలో విశాఖలో ట్రాఫిక్ రద్దీని తట్టుకునేలా ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ రోడ్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మించి ఉండాలి. కానీ కొత్తగా ఒక్కటీ నిర్మించలేదు.

చంద్రబాబు నాయుడు హయాంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కురుసుర సబ్ మెరైన్‌ని ఆర్‌కే బీచ్ సమీపంలో సముద్రం ఒడ్డున పెట్టించడంతో అది పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది.

గత కొన్నేళ్ళుగా సముద్రం కోతకు గురవుతుండటంతో ఆ సబ్ మెరైన్ మ్యూజియం గోడ వరకు నీళ్ళు వచ్చేశాయి. ఆర్‌కే బీచ్ సముద్ర తీరం కోతకు గురవడంతో చాలా ప్రమాదకర పరిస్థితి నెలకొని ఉంది. కానీ పర్యాటకశాఖ మంత్రిగా చేసిన రోజా కనీసం ఈ సమస్యలని కూడా సరిచేయించలేదు. అసలు ఆమెకు ఈ సమస్య గురించి తెలుసో లేదో?

కానీ ఇప్పుడు ఋషికొండ ప్యాలస్‌ గురించి ట్విట్టర్‌లో ‘తాము విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక భవనాలు నిర్మించడం తప్పా? వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టినవాళ్లకు అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా..?” అంటూ చాలా పెద్ద మెసేజ్ పెట్టారు.

ఆ భవనం జగన్‌ కోసమే కట్టామని ఇదివరకు స్వయంగా రోజాయే ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పారు. ఇప్పుడు పర్యాటకుల కోసం కట్టామని కొత్త కధ చెపుతున్నారు.

విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుంటే నగరంలో రోడ్లు, ఫ్లైఓవర్‌లు, డ్రైనేజ్ వ్యవస్థ, విద్యుత్ దీపాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. కానీ రూ.4-500 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి జగన్‌ కోసం ప్యాలస్‌ కట్టుకోవడమే విశాఖ అభివృద్ధి అని రోజా వితండవాదం చేస్తుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా?

ADVERTISEMENT
Latest Stories