ప్రగల్భాలతో కేసీఆర్‌, నిశబ్ధంగా చంద్రబాబు సాధించింది ఏమిటి?

CBN KCR

ఒక్కోసారి రాజకీయ పార్టీల అధినేతల ఆలోచనలు, వారి వ్యూహాలు, నిర్ణయాలు ఆయా పార్టీలను ఎంతగానో ప్రభావితం చేస్తుంటాయి. తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, జగన్, కేసీఆర్‌, రేవంత్‌ రెడ్డిల ప్రస్తావన లేకుండా రాజకీయాల గురించి మాట్లాడుకోలేము.

ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌ల ఆలోచనలు, నిర్ణయాలను పోల్చి చూసుకున్నప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి.

ADVERTISEMENT

కేసీఆర్‌ సిఎంగా ఉన్నప్పుడు తన అంత దూరదృష్టి, అపర చాణక్యుడు మరొకరు లేరనే విదంగా వ్యవహరించేవారు. అందుకు తగ్గట్లే తెలంగాణని శరవేగంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపడంతో అందరూ కూడా సమకాలీన రాజకీయాలలో ఆయన అంత గొప్ప మేధావి మరొకరు లేరనే అందరూ నమ్మారు. ఆయన కూడా తనను తాను అలాగే ఊహించుకునేవారు.

కేసీఆర్‌ దేశ రాజకీయాలను శాశించే స్థాయికి ఎదిగిపోయినప్పుడు, ఇక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడు జగన్‌ వేధింపులతో సతమతమవుతుండేవారు. చంద్రబాబు నాయుడుని జగన్‌ జైల్లో పెట్టడం, దాంతో రాష్ట్రంలో టిడిపి చాలా బలహీనపడటంతో కేసీఆర్‌ ముందు చంద్రబాబు దిగదుడుపే అని అనిపించిందంటే అతిశయోక్తి కాదు.

కానీ చంద్రబాబు నాయుడుకి కేసీఆర్‌లాగ నోటి దురుసుతనం, అసందర్భ ప్రేలాపనలు, గొప్పలకు పోయి హడావుడి చేసే అలవాటు లేదు.

కనుక ఏపీలో జగన్‌ వేధింపులతో టిడిపి మనుగడ ప్రశ్నార్ధకంగా మారిన పరిస్థితులలో కూడా చంద్రబాబు నాయుడు చాలా నిబ్బరంగా వ్యవహరిస్తూ, పార్టీ చెల్లాచెదురు కాకుండా కాపాడుకుంటూ, జగన్‌తో అవిశ్రాంతంగా పోరాడుతూ మళ్ళీ నేడు ముఖ్యమంత్రిగా శాసనసభలో అడుగుపెట్టారు.

అయితే చంద్రబాబుని జగన్‌ వేధించిన్నట్లుగా రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌ను వేధించడం లేదు. పైగా పాలనాపరంగా తడబడుతూ కేసీఆర్‌కు అనేక అవకాశాలు కూడా అందిస్తున్నారు.

అయినా కూడా కేసీఆర్‌ ఖాళీ అయిపోతున్న తన పార్టీని కాపాడుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు అత్యంత క్లిష్ట పరిస్థితులలో కూడా టిడిపిని కాపాడుకోగలిగారు కానీ కేసీఆర్‌కి అనుకూలమైన పరిస్థితులున్నా పార్టీని కాపాడుకోలేకపోతున్నారని స్పష్టం అవుతోంది.

చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌ ఇద్దరూ ప్రధాని నరేంద్రమోడీకి సన్నిహితంగా మెలిగినవారే. ఇద్దరూ ఆయనపై కత్తులు దూసినవారే.

2014లో, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అందివచ్చిన అవకాశాలను తెలివిగా ఉపయోగించుకుని తన పార్టీ నేతలకు కేంద్ర మంత్రి పదవులు సంపాదించి పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి వారి సేవలను ఉపయోగించుకుంటున్నారు.

అదే… కేసీఆర్‌ మోడీతో చాలా సఖ్యతగా ఉంటూ ఆయన ప్రభుత్వానికి, వివాదాస్పద నిర్ణయాలకు పూర్తి మద్దతు ఇస్తూ కూడా తన రాష్ట్రానికి, తన పార్టీ నేతలకు ఏమీ దక్కేలా చేయలేకపోయారు. కూతురు కల్వకుంట్ల కవితని కేంద్ర మంత్రిని చేద్దామనుకున్నారు. కానీ ఆ తర్వాత మోడీపై కత్తులు దూసి కూతురుని జైలు పాలు చేసుకున్నారు.

శక్తివంతమైన మోడీతో యుద్ధం కంటే స్నేహం చేయడమే మంచిదని చంద్రబాబు గ్రహించి, భేషజాలను పక్కన పెట్టి మళ్ళీ మోడీతో చెయ్యి కలిపి తాను, తన పార్టీ లాభపడేలా చేసుకున్నారు. కానీ కేసీఆర్‌ మాత్రం నేటికీ అదే అహంభావంతో మోడీపై కత్తులు దూస్తుండటం వలననే కూతురు కల్వకుంట్ల కవితని జైలు నుంచి విడిపించుకోలేకపోతున్నామని గ్రహించలేకపోతున్నారు.

కేసీఆర్‌ చంద్రబాబు నాయుడు గురించి ఎంత అవహేళనగా మాట్లాడేవారో, ఆయనని రాజకీయంగా దెబ్బతీయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేశారో అందరూ చూశారు. కానీ కేసీఆర్‌ తనని అంత అవహేళన చేస్తున్నా చంద్రబాబు నాయుడు ఏనాడూ సంయమనం కోల్పోలేదు. నోరు జారలేదు. హడావుడి చేయలేదు. కానీ శాసనసభ ఎన్నికలలో కేసీఆర్‌కు సైలంట్‌గా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు. అది ముట్టిందని కేసీఆర్‌ బయటకు చెప్పుకోలేకపోతున్నారు.

కేసీఆర్‌కి వడ్డించిన విస్తరి వంటి హైదరాబాద్‌ లభించడంతో తెలంగాణను అభివృద్ధి చేశారు. కానీ చంద్రబాబు నాయుడుకి రాజధాని, ఖజానాలో పైసా లేని ఆంధ్రప్రదేశ్‌ చేతికి వస్తే దాంతోనే వీలైనంత వరకు ఏపీని అభివృద్ధి చేశారు.

కేసీఆర్‌ వద్ద పట్టుమని 10 మంది ఎంపీలు కూడా లేకపోయినా ప్రధానమంత్రి అయిపోదామని కలలుగన్నారు. ఆ ఆలోచనతోనే టిఆర్ఎస్‌ని బిఆర్ఎస్ పార్టీగా మార్చేసుకుని పెద్ద తప్పటడుగువేసి తెలంగాణలోనే అధికారం కోల్పోయి ఇప్పుడు రాష్ట్రం దాటి బయట అడుగుపెట్టలేని దుస్థితిలో ఉన్నారు.

కానీ చంద్రబాబు నాయుడు ఏనాడూ కేసీఆర్‌లాగ ప్రగల్భాలు పలకలేదు. ప్రధాని కావాలని తహతహలాడలేదు. కానీ ఇప్పుడు ‘కింగ్ మేకర్’గా ఎంత గౌరవమర్యాదలు పొందుతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక కేసీఆర్‌, చంద్రబాబు నాయుడు ఇద్దరిలో ఎవరు తెలివైన, పరిణతి కలిగిన రాజకీయ నాయకుడు?

ADVERTISEMENT
Latest Stories