వైసీపి మూడో జాబితాలో బలిపశువులు ఎవరో?

Jagan YCP

ఏపీ సిఎం జగన్‌ ఈ నెలాఖరులోగా వీలైతే సంక్రాంతి పండుగ లోగానే వైసీపి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులని ప్రకటించేయాలని చాలా పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే రెండు విడతలలో కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను, ఎంపీలను తప్పించేసి వారి స్థానాలలో కొత్తవారిని నియమించారు. మరికొందరికి నియోజకవర్గాలను మార్చారు.

మొదటి రెండు జాబితాలతో వైసీపిలో మొదలైన అసమ్మతి, అసంతృప్తి జ్వాలలు ఇంకా చల్లారక మునుపే జగన్‌ మూడో జాబితాని సిద్దం చేస్తున్నారు. దీనిలో సుమారు 25-30 స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తోంది. కనుక మూడో జాబితాలో ఎంతమంది బలిపశువులు అవుతారో నేడో రేపో తేలిపోనుంది.

ADVERTISEMENT

మంగళవారం పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు తాడేపల్లి ప్యాలస్‌కు వచ్చారు. వారిలో కొంతమందికి పిలుపు రాగా మిగిలినవారు తమ పరిస్థితిని తెలుసుకునేందుకు వచ్చారు.

తాజా సమాచారం ప్రకారం, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌ని పక్కనపెట్టి ఆయన స్థానంలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్‌కి అవకాశం కల్పించబోతున్నారు. అలాగే నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్దర్‌ని తప్పించి కడప జిల్లాకు చెందిన డాక్టర్ సుధీర్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ పక్కన పెట్టి మంత్రి బొత్స సత్యనారాయణ బంధువు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శీను)లకి దాదాపు సీట్లు ఖాయం చేసిన్నట్లు తెలుస్తోంది.

మార్కాపురం ఎమ్మెల్యే కె.నాగార్జున రెడ్డిని తప్పించి ఆయనకు బదులు ఆ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకట రెడ్డిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధిని ఇదివరకే పక్కన పెట్టడంతో ఆయన తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. కనుక ఆయనకు నచ్చజెప్పేందుకు మళ్ళీ నిన్న సోమవారం తాడేపల్లి ప్యాలస్‌కు పిలిచినప్పటికీ జగన్‌ తీరుతో ఆయన మరింత అసంతృప్తికి లోనైనన్నట్లు తెలుస్తోంది. “టికెట్‌ ఇవ్వనని చెప్పేసాక మళ్ళీ నన్ను పిలిచి అవమానించడం దేనికి?” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన్నట్లు తెలుస్తోంది.

రాబోయే ఎన్నికలలో 175 సీట్లు సాధించడం కోసమే ఈ మార్పులు, చేర్పులు అని వైసీపి ఎంత గట్టిగా సమర్ధించుకుంటున్నప్పటికీ, వీటి కారణంగానే వైసీపి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులలో పెరుగుతున్న అసంతృప్తి, భయాందోళనలు, అభద్రతాభావం వైసీపి కొంపముంచేలా ఉన్నాయి.

ADVERTISEMENT
Latest Stories