టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకుని ఎన్నికలలో కలిసి పోటీ చేయబోతున్నాయి. కనుక రెండు పార్టీల మద్య సీట్ల సర్దుబాట్లు, ఉమ్మడి మ్యానిఫెస్టోపై చర్చించేందుకు పవన్ కళ్యాణ్ శనివారం రాత్రి ఉండవల్లి చంద్రబాబు నాయుడు నివాసానికి వచ్చి భేటీ అయ్యారు.
సుమారు మూడు గంటలపాటు వారు ఈ రెండు అంశాలపై చర్చించుకున్నారు. ఈ సమావేశంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.
ఓవైపు అధికార వైసీపి వరుసపెట్టి తమ పార్టీ అభ్యర్ధులను నియోజకవర్గం ఇన్‌చార్జిలను ప్రకటిస్తూ దూకుడుగా సాగుతుంటే, టిడిపి, జనసేనలు మాత్రం ఇంతవరకు సీట్ల సర్దుబాట్లు చేసుకుని అభ్యర్ధులను ప్రకటించ లేకపోవడం ఆశ్చర్యంగానే ఉంది. రెండు పార్టీలు ఇప్పటికే ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నప్పటికీ, అదే విషయం ప్రకటించలేకపోవడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి.
1. పొత్తుల గురించి బీజేపీ తేల్చకపోవడం.
2. వైసీపి జాబితాలలో టికెట్ లభించనివారి కోసం ఎదురుచూపులు చూస్తుండటం.
నిజానికి సంక్రాంతి పండుగలోగానే టిడిపి, జనసేనలు అభ్యర్ధులను ప్రకటించాలనుకున్నాయి కానీ పైన చెప్పుకున్న రెండు కారణాల వలన ఆలస్యమవుతున్నట్లు భావించవచ్చు.
అయితే టిడిపి, జనసేనలు అభ్యర్ధులను ప్రకటించడం ఆలస్యమవుతున్నకొద్దీ రెండు పార్టీల క్యాడర్‌లో అయోమయం నానాటికీ పెరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా రెండు పార్టీలలో టికెట్స్ ఆశిస్తున్నవారిలో అసహనం పెరిగిపోతే వారిని వైసీపి నేతలు రెచ్చగొట్టి రెండు పార్టీల మద్య చీలికలు సృష్టించేందుకు ప్రయత్నించవచ్చు కూడా.
ఎన్నికల షెడ్యూల్ వెలువడే వరకు అభ్యర్ధుల విషయంలో ఇలాగే అయోమయం కొనసాగితే అది రెండు పార్టీలకు మంచిది కాదు. టికెట్లు ఖరారు కాకపోతే అభ్యర్ధులకు ఎన్నికల ప్రచారానికి ఏర్పాట్లు చేసుకొనేందుకు సమయం సరిపోదు.
టికెట్ దొరకని అభ్యర్ధుల అలకలు, అసమ్మతి రాగాలు, బుజ్జగింపులు, రాజీనామాల పర్వం కూడా ఉంటుంది. ప్రస్తుతం వైసీపిలో ఈ దశలోనే ఉంది. కనుక ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే ఈ పర్వం ముగించుకొని సర్వసన్నాహాలు చేసుకొని బరిలో దిగే అవకాశాలు దానికి పెరిగాయి. అలాగే టిడిపి, జనసేనలు కూడా ఈ ప్రక్రియని ఎంత త్వరగా ముగించుకొని ఎన్నికలకు సిద్దమైతే వాటికి అంత మంచిది.




