ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ శాసనసభ సమావేశాలు ఫిభ్రవరి 11 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. తొలిరోజున గవర్నర్ ప్రసంగంతో మొదలవుతుంది. బడ్జెట్ కేటాయింపుల గురించి ఎలాగూ శాసనసభలో, మీడియాలో ఎలాగూ లోతుగానే చర్చ జరుగుతుంది.
కానీ కూటమి ప్రభుత్వం ఆర్ధిక విధానాలు బాగోలేవని, చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం ఆర్ధికంగా దివాలా తీస్తోందని, జీడీపీ వృద్ధి రేటు పడిపోయిందని, విచ్చలవిడిగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోతోందంటూ జగన్, వైసీపీ నేతలు రోజూ ఆరోపిస్తూనే ఉంటారు.
కనుక 2026-27 ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడే జగన్ శాసనసభ సమావేశాలకు హాజరయ్యి తమ వాదనలు వినిపిస్తే, ఆ తర్వాత ఎన్ని విమర్శలు చేసినా అర్థం ఉంటుంది. కానీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని ప్రభుత్వాన్ని విమర్శిస్తుండటాన్ని ప్రజలు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నంగానే చూస్తారనే విషయం జగన్ గ్రహించడం లేదు.
అంతేకాదు… ప్రధాన ప్రతిపక్షహోదా ఇవ్వలేదనే కుంటిసాకుతో శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా ఇంట్లో కూర్చొని జీతభత్యాలు తీసుకుంటున్నారనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు విమర్శలు ప్రజలకు బాగా చేరుతున్నాయనే విషయం కూడా జగన్ గ్రహించినట్లు లేదు.
కనుక ప్రతీ శాసనసభ సమావేశాలు వైసీపీ పాలిట శాపంగా మారుతున్నాయని కూడా జగన్ గ్రహించడం లేదు. అది కూటమి ప్రభుత్వం అదృష్టంగానే భావించాలి.






