ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారి నాలుగు నెలలు గడిచిపోయాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై కూడా చాలా భారీ అంచనాలున్నాయి. ఈ విషయం ఆయనతో సహా కూటమిలో అందరికీ తెలుసు. కనుక అందుకు అనుగుణంగానే అమరావతి, పోలవరం నిర్మాణ పనులు మొదలుపెట్టిస్తున్నారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకి డిసెంబర్‌లో శంకుస్థాపన జరుగనుంది. పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్శించేందుకు గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి.
ప్రజలు శరవేగంగా రాష్ట్రాభివృద్ధి చేయాలని కోరుకొంటుంటే, అవన్నీ కాదు… ముందు రెడ్ బుక్ బయటకు తీసి వైసీపి నేతల భరతం పట్టమని పార్టీలో ఒత్తిళ్ళు ఉండనే ఉన్నాయి. కనుక సిఎం చంద్రబాబు నాయుడు మూడింటినీ బ్యాలన్స్ చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. లేకుంటే ఊహించని సమస్యలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంటుంది.
రాష్ట్రాభివృద్ధి అంటూ వైసీపిని ఉపేక్షిస్తూండటం ఎంతమాత్రం సరికాదని, గత 5 ఏళ్ళుగా వైసీపి వేధింపులు భరిస్తూ టిడిపిని గెలిపించుకొన్నది ఇందుకేనా?మమ్మలని వేధించిన వైసీపి పట్ల అంత మెతక వైఖరి దేనికి? యువగళం పాదయాత్ర రెడ్ డైరీ చూపించి ఏం చెప్పారు? ఇప్పుడు ఎందుకు చల్లబడిపోయారు? అని పార్టీ కోసం పనిచేసినవారు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
అలాగని వారి ఒత్తిళ్ళకు లొంగి వైసీపిపై కటిన చర్యలు చేపడితే రాజకీయ కక్ష సాధింపు మొదలైపోయిందని జగన్ అండ్ కో గగ్గోలు పెడుతూ ప్రజల సానుభూతి పొంది తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేయక మానరు.
కనుక శాస్త్రోక్తంగా అంటే చట్టప్రకారమే వైసీపికి ప్రాయశ్చిత్తం జరపాలని సిఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. బహుశః అందుకే టిడిపి కార్యాలయం, తన నివాసంపై వైసీపి నేతల దాడి కేసుని ఏపీ సీఐడీకి అప్పగించిన్నట్లున్నారు.
అయితే వైసీపి నేతలకి పోలీసులు, ఈ కేసులు, కోర్టులు కొత్తేమీ కావు. కనుక వీటితో కూటమి ప్రభుత్వం ఏమైనా సాధించగలదా? కనీసం పార్టీ క్యాడర్‌ని సంతృప్తి పరచగలదా?అంటే అనుమానమే.
ఎందువల్ల అంటే, ఎటువంటి కేసులలో వైసీపి నేతలను లోపల వేసినా నెల తిరక్కుండా బెయిల్ తీసుకొని బయటకు వచ్చేస్తున్నారు. కనుక వైసీపిని ఏవిదంగా హ్యాండిల్ చేయాలో సిఎం చంద్రబాబు నాయుడే ఆలోచించుకోవలసి ఉంటుంది.
ఎన్నికలలో ప్రకటించిన హామీల గురించి ప్రజలు అడగనప్పటికీ, వైసీపి వారికి గుర్తుచేసి వాటి గురించి ఆలోచించేలా చేస్తోంది. కనుక హామీల అమలు ఆలస్యమవుతున్న కొద్దీ ప్రజలలో అసంతృప్తిని వైసీపి రాజేయగలుగుతుంది. కనుక వీలైనంత త్వరగా హామీలు ఒకటొకటిగానైనా అమలుచేయడం చాలా అవసరమే.
చివరిగా ఒక్క మాట చెప్పుకోవాలి. ఇదివరకు జగన్ భారీ మెజార్టీతో అధికారం చేపట్టినప్పుడు, 5 ఏళ్ళు ఏమీ చేయకుండానే నిశ్చింతగా కాలక్షేపం చేయగలిగారు.
కానీ ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వానికి అంతకంటే భారీ మెజార్టీ ఉన్నప్పటికీ ఇన్ని ఒత్తిళ్ళు ఎదుర్కోవలసివస్తుండటం ఆలోచింపజేస్తుంది.
జగన్‌పై ప్రజలు ఎటువంటి నమ్మకాలు పెట్టుకోకపోవడం, చంద్రబాబు నాయుడుపై చాలా నమ్మకం పెట్టుకోవడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు.






