గన్ కన్నా జగన్ వేగంగా వస్తారు, నేనున్నాను నేను విన్నాను, ఒక్క ఛాన్స్ ప్లీజ్…ఇవన్నీ కూడా నాటి జగన్ ప్రజాసంకల్ప యాత్ర తాలూకా నినాదాలు. అయితే ఆ నినాదాలన్నీ కూడా జగన్ కు 2019 లో అధికారాన్ని కట్టబెట్టాయి.
అలాగే నవరత్నాలు, అమరావతే రాజధాని, రాష్ట్రంలో మద్యపాన నిషేధం, అధికారంలోకి వచ్చిన వారం రోజులలో సీపీఎస్ రద్దు, పోలవరం పూర్తి అనేవి జగన్ పాదయాత్ర 1.0 లో వైసీపీ ఇచ్చిన హామీలు. ఆ హామీలు కూడా జగన్ కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాయి.
ఇక రాజకీయంగా చూస్తే, నాటి జగన్ పాదయాత్ర సమయంలో ఏపీ రాజకీయాలు టీడీపీ, వైసీపీ, జనసేన అంటూ త్రిముఖ పార్టీల పోరుతో నడిచింది. ఇక బీజేపీ కూడా పరోక్షంగా వైసీపీ కి తెరచాటు సాయమందించింది. అలాగే అటు తెలంగాణలో సైతం కేసీఆర్ జగన్ గెలుపు కోసం వైసీపీ తో చేయికలిపారు.
దానికి తోడు తండ్రి లేని బిడ్డ అంటూ తల్లి విజయలక్ష్మి, అన్న వదిలిన బాణంగా చెల్లి షర్మిల కూడా బై బై బాబు అంటూ వైసీపీ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ఇక వివేకా దారుణ హత్య, కోడికత్తి వంటి సెంటిమెంట్ రాజకీయాలు కూడా వైసీపీ విజయానికి అనుకూలంగా మారాయి.
ఇన్ని సానుకూల పరిస్థితుల నడుమ జగన్ పాదయాత్ర వైసీపీ కి కలిసొచ్చింది, జగన్ కు అధికారాన్ని తెచ్చిపెట్టింది. అయితే నాడు వైసీపీ కి అనుకూలంగా ఉన్న అంశాలన్నీ కూడా నేడు వైసీపీ వ్యతిరేకంగా మారాయి. అలాగే నాడు జగన్ కు బలంగా ఉన్న రాజకీయ పరిస్థితులన్నీ కూడా నేడు బలహీనమయ్యాయి.
గన్ కన్నా జగన్ స్పీడ్ అంటూ నాడు వైసీపీ ఇచ్చిన ఎలివేషన్స్ జగన్ ను అధికారంలో ఎలా అయితే తీసుకోచ్చాయో ఆ తరువాత రాష్ట్ర పరిస్థితులకు జగన్ స్పందించిన తీరు అలానే జగన్ కు అధికారాన్ని దూరం చేసాయి. పాదయాత్రలో అందరికి ముద్దలు పెట్టి హగ్గులు ఇచ్చిన జగన్ ప్రభుత్వంలోకి రాగానే పరదాల మాటున, ప్యాలస్ ల చాటున ప్రజలకు దూరమయ్యారు, ప్రజలను దూరం పెట్టారు.
మళ్ళీ ఇప్పుడొచ్చి ప్రజలే నాకు దేవుళ్ళు అంటూ జగన్ తలలు నిమిరితే దానిని నమ్మి వైసీపీ కి తలవంచేందుకు ప్రజలు సిద్ధంగా ఉంటారా.? నాడు నేనున్నాను నేను విన్నాను అంటే నమ్మిన ప్రజలు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు అమరావతి రైతులు, ఆ రైతు కుటుంబాలు రోడ్డెక్కి రోధిస్తే, తమ గోడు వినాలని అర్థిస్తే కనీసం జగన్ వారి పోరాటాలను గుర్తించారా.? గౌరవించారా.?
అటువంటి జగన్ మళ్ళీ వచ్చి నేనున్నాను – నేను వింటాను అంటే ఇప్పుడున్న పరిస్థితులలో జగన్ మాటలు వినడానికి జనాలు ఉంటారా.? ఇక ముఖ్యంగా రాష్ట్ర రాజధాని విషయంలో నాడు అసెంబ్లీ సాక్షిగా, ప్రజల ఎదుట అమరావతికి సమ్మతమే అంటూ జగన్ ఇచ్చిన మాట అధికారంలోకి రాగానే ఎలా మూడు ముక్కలయ్యిందో ఏపీతో పాటు దేశం మొత్తం చూసింది.
మరి ఇప్పుడు జగన్ పాదయాత్ర 2.0 లో రాజధాని పై వైసీపీ అభిప్రాయం ఇది అంటూ జగన్ ప్రజలకు మాట ఇచ్చినా చివరికి ఆ విషయం పై మడం తిప్పరు అనే గ్యారెంటీ ప్రజలకు ఇవ్వగలరా.? అలాగే నాడు మద్యనిషేధం అంటూ వచ్చి ప్రభుత్వమే అధిక ధరలకు జే బ్రాండ్లను అమ్మిన వైనాన్ని ప్రజలు మరిచిపోతారా.?
ఇక నాడు వైసీపీ అండగా, జగన్ కు బలంగా నిలబడిన తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల ఇప్పుడు వైసీపీ ఓటమిని, జగన్ పతనాన్ని కోరుకుంటున్నారు. అలాగే నాటి కోడికత్తి, వివేకా సెంటిమెంట్ రాజకీయాలు గులకరాయి డ్రామాతో నీరుకారిపోవడంతో ఈ సారి అటువంటి రాజకీయాలకు ప్రజలనుండి సానుకూల స్పందన వస్తుందా.?
చివరిగా నాడు వైసీపీ విజయంలో నేడు వైసీపీ ఓటమిలో కీలక పాత్ర పోషించిన జనసేన రాబోయే ఎన్నికలలో కూడా తానూ కూటమిలోనే కొనసాగుతునని, చంద్రబాబు నాయకత్వాన్నే బలపరుస్తానని, వైసీపీ వ్యతిరేక ఓటు మరో పదేళ్లు చీలనివ్వను అని తెగేసి చెప్పేసారు.
టీడీపీ కూడా అందుకు మేము సైతం అంటూ కూటమి పొత్తుకు సై అంటూ తన పార్టీ బలాన్ని జనసేన, బీజేపీ లతో కలిసి పంచుకోవడానికి సిద్ధమయ్యింది. బీజేపీ కూడా వైసీపీ ట్రాప్ లో పడేందుకు సుముఖంగా లేకపోవడంతో ఈసారి కూడా వైసీపీ ఆశలన్నీ నిరాశలుగా మిగాలాల్సిన పరిస్థితి.
ఇక నాడు రిటర్న్ గిఫ్ట్ ల రూపంలో వైసీపీ కి విజయాన్ని అందించిన కేసీఆర్, బిఆర్ఎస్ నేడు అదే రిటర్న్ గిఫ్ట్ లు పొంది వారు అధికారం కోసం అరువులు చాచుతున్నారు. ఇలా ఈసారి జగన్ 2.0 పాదయాత్ర వైసీపీ కి బలం కన్నా బరువే అవుతుంది. అలాగే జగన్ కు ప్లస్ కన్నా మైనస్సే అవుతుంది.
ఈ నేపథ్యంలో తాజాగా జగన్ నేను మరో ఏడాదిన్నర తరువాత ఏలూరు నుంచే పాదయాత్ర 2.0 మొదలుపెడతాను, వైసీపీ ని తిరిగి అధికారంలోకి తెస్తాను అంటూ ప్రకటించడంతో వైసీపీ ముందు ఎన్నో ప్రశ్నలు సమాధానం కోసం కాసుకొని కూర్చున్నాయి. మరి వాటికీ జగన్ జవాబు చెప్పగలరా.? వాటిని ప్రజలు విశ్వసించగలరా.?
వైసీపీ హామీలను నమ్మే పరిస్థితి ఉండదు, జగన్ మాటలను విశ్వసించే సాహసం చేయలేరు, ఒక్క ఛాన్స్ తాలూకా కూల్చివేతలు, విధ్వంసాలు కళ్ళముందు సాక్ష్యాలుగా కనిపిస్తుంటే, నాటి వైసీపీ రంగు రాజకీయాలు, బూతు రాజకీయాలు ఇప్పటికి వినిపిస్తుంటే జగన్ 2.0 తో వైసీపీ 2.0 సాధ్యమవుతుందా.?






