రేవంత్‌ రెడ్డిని చూసి నేర్చుకోవాలి కదా?

Revanth Reddy strategy

రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రికి తన రాష్ట్రం, ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. అందుకోసమే పోరాడి తెలంగాణ సాధించుకున్న కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే లక్ష్యంతో పని చేశామని బీఆర్ఎస్‌ నేతలు నేటికీ గొప్పగా చెప్పుకుంటారు.

తెలంగాణ ప్రయోజనాలు కాపాడే పేరుతో ఇరుగు పొరుగు రాష్ట్రాలతో, కేంద్ర ప్రభుత్వంతో కయ్యమాడటమే సరైన విధానంగా మార్చేశారు. ఇదే సరైన విధానమని ఆయన ప్రజలను ఎంతగా నమ్మించారంటే, ప్రజలు రెండోసారి కూడా ఆయననే ఎన్నుకున్నారు!

ADVERTISEMENT

దాంతో ఆయన ఈ విధానానికి మరింత మెరుగులు దిద్ది, తన రాజకీయ ప్రత్యర్ధులను చావు దెబ్బ తీశారు. ఢిల్లీపై దండయాత్రకు బయలుదేరారు. దానికి ఆయన భారీ మూల్యం చెల్లించారు.

అయితే ఆయన సృష్టించిన ఈ భావజాలం నుంచి ప్రజలను, తెలంగాణ రాజకీయాలను బయటపడేయడం అసాధ్యంగా మారింది. అందువల్లే సిఎం రేవంత్ రెడ్డి కూడా నీళ్ళ కోసం సిఎం చంద్రబాబు నాయుడుపై కత్తులు దూయక తప్పడం లేదు.

కానీ సిఎం రేవంత్ రెడ్డి కేంద్రంతో సఖ్యతగానే ఉంటున్నారు. ఇటీవల జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడిన మాటలు వింటే, ఓ ముఖ్యమంత్రిగా అయన చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని అర్ధమవుతుంది.

“నేను పదేపదే ప్రధాని మోడీని కలుస్తుంటానని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయనేమీ నా చుట్టం కాదు. ఈ దేశానికి ప్రధాన మంత్రి. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరం అయనని గౌరవించాలి.

ఆయన అనుమతిస్తేనే రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు, పరిశ్రమలు, విమానాశ్రయాలు వస్తాయి. మనం దుమ్మిరెడ్డి వద్ద ప్రాజెక్టు కట్టుకోవాలంటే ఎగువనున్న మహారాష్ట్ర సహకారం, అనుమతి అవసరం. ఆ రాష్ట్రంలో బిజేపి అధికారంలో ఉంది. కనుక ప్రధాని మోడీ చేత అక్కడి ప్రభుత్వానికి ఓ మాట చెప్పిస్తే మన పని సులువవుతుంది.

నాకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం. కనుక తెలంగాణ కోసం కోసం ప్రధాని మోడీని ఒకసారి కాదు.. వందసార్లు కలిసేందుకు నేను సిద్ధమే,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.

కేసీఆర్‌తో పోలిస్తే సిఎం రేవంత్ రెడ్డి వయసులో, అనుభవంలో చాలా చిన్నవారే. కానీ అపర చాణక్యుడని చెప్పుకున్న కేసీఆర్‌ని ఓడించడమే కాకుండా ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రిలా కేంద్రంతో చాలా విజ్ఞతతో వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోడీ హైదరాబాద్‌వస్తే కేసీఆర్‌ అవమానిస్తూ ఉండేవారు. మహిళా గవర్నర్‌ తమిళసైని పదేపదే అవమానించేవారు. కేసీఆర్‌ ప్రవర్తన వలన తెలంగాణకు తీరని నష్టం, అప్రదిష్ట కూడా కలిగాయి.

కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారైనప్పటికీ ప్రధాని మోడీ, గవర్నర్ పట్ల ఎంతో వినయంగా, సఖ్యతగా వ్యవహరిస్తూ తెలంగాణకు ఒక రూపాయి లాభం కలిగిస్తున్నారు తప్ప నష్టం కలిగించడం లేదు.

సిఎం రేవంత్ రెడ్డికి ఉన్న ఈ విజ్ఞత కేసీఆర్‌కి లేకపోతేపోయే. ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుదామని ఆశపడుతున్న ఆయన కుమారుడు కేటీఆర్‌కైనా ఉందా? అంటే ఆయన కూడా తండ్రి బాటలోనే నడుస్తూ తమ ముఖ్యమంత్రిని, రాహుల్ గాంధీలని ‘హౌలే గాళ్ళు’ అని అంటున్నారు.

బీఆర్ఎస్‌ పార్టీ నేతల ప్రవర్తన, మాట తీరు ఈవిధంగా ఉంది కనుకనే ప్రజలు మళ్ళీ వారికి అవకాశం ఇవ్వరని సిఎం రేవంత్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నారు. అందుకే 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ధీమాగా చెప్పగలుగుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories