“ఫలానా పార్టీ నేతలు, కార్యకర్తలు ఫలానా పార్టీలు చేరారు. ఫలానా పార్టీకి పెద్ద షాక్…” అంటూ మీడియాలో వార్తలు చూస్తుంటాము.
కానీ రాజకీయపార్టీలు సొంతంగా కార్యకర్తలలో నుంచి నేతలను తయారు చేసుకుంటే ఆ పార్టీ పునాదులు ఎన్ని దశాబ్దాలైనా బలంగా ఉంటాయి. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా చెక్కుచెదరవని టీడీపి నిరూపించి చూపింది.
ఏపీలో వైసీపీకి ‘రప్పారప్పా’ వంటి బలమైన భావజాలం గల నేతలు, కార్యకర్తలు ఉన్నారు. టీడీపి నుంచి వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటివారు వైసీపీలోకి వెళ్ళి సులువుగా ఇమిడిపోవడానికి కారణం వారిలో కూడా రప్పారప్పా భావజాలం బలంగా ఉండటమే.
వైసీపీ గొడుగు కింద ఒకే ధోరణి గల శక్తులన్నీ నిలబడ్డాయి కనుకనే అది ఉవ్వెత్తున ఎగిసి పాతాళంలో పడిపోయినప్పటికీ మళ్ళీ ‘రప్పా రప్పా’ అంటూ లేచి నిలబడగలిగింది. కూటమి ప్రభుత్వానికి సవాలు విసరగలుగుతోంది.
వైసీపీలో ఆనం, కోటంరెడ్డి వంటి కొందరు సీనియర్లు ఇమడలేకపోవడానికి కారణం కూడా ఇదే. కనుక వారందరూ టీడీపిలోకి వచ్చేసి చక్కగా ఇమిడిపోయారు.
ఈ రెండు పార్టీల ఆలోచనా ధోరణి, పనితీరు, వాటి భావజాలం ప్రతీది పూర్తి భిన్నంగా ఉంటాయని స్పష్టమైనప్పుడు, అవసరం లేకపోయినా ఒక పార్టీలో నుంచి మరో పార్టీలోకి నేతలను తెచ్చుకొని ‘సంకరం’ చేసుకుంటే వాటికే నష్టం కదా?
తాజాగా నంద్యాల జిల్లాలో ‘వైసీపీకి పెద్ద షాక్’ కూడా ఇటువంటిదే అనిపిస్తుంది. టీడీపిలో సమర్ధులైన, నమ్మకస్తులైన నేతలకు కరువు లేదు. నిజం చెప్పాలంటే వారందరికే టీడీపి న్యాయం చేయలేకపోతోంది. అయినా వారందరూ పార్టీలో పుట్టి పెరిగినవారు కనుక అర్థం చేసుకొని సర్దుకుపోతున్నారు.
మరి ఇటువంటప్పుడు రప్పా రప్పా పార్టీ నుంచి నేతలని, కార్యకర్తలని తెచ్చుకోవడం అవసరమా? అలాంటి భావజాలం కలిగిన నేత టీడీపికి ఆ విష సంస్కృతీ తీసుకువస్తే? ఆలోచించుకుంటే మంచిది.






