టీడీపీ ఎందుకో వెనకబడుతుందా.?

Why TDP’s Silence Is Hurting Its Political Strength

అవును టీడీపీ కొన్ని విషయాలలో ఎందుకో చాల వెనకబడింది అనే భావన సొంత పార్టీ క్యాడర్ లో కూడా బలంగా పాతుకుపోతుంది. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కునే విషయంలో టీడీపీ ఎదిగే కొద్దీ ఎందుకో వెనక్కి వెళుతుంది. గతంలో టీడీపీ పార్టీ పై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చెయ్యాలి అంటే చాల ఆచితూచి ముందుకొచ్చేవారు.

కానీ ప్రస్తుత పరిస్థితులలో పార్టీ పైన విమర్శల సంగతి పక్కన పెడితే పార్టీ అధినేత చంద్రబాబు మీద వ్యక్తిగత విమర్శలు, ఆయన సతీమణి భువనేశ్వరి పై ఆత్మాభిమాన దాడులు పరిధిని దాటిపోతున్నాయి. టీడీపీ లో పుట్టిపెరిగిన నేతలు, బాబు నాయకత్వంలో నాయకులుగా రాటుతేలిన వారు సైతం బాబు పై వ్యక్తిగత దాడికి వెనుకాడడం లేదు.

ADVERTISEMENT

ఇందుకు ఉదాహరణలుగా కొడాలి నాని మొదలుకుని రోజా వరకు, వల్లభనేని వంశీ నుంచి దేవినేని అవినాష్ వరకు టీడీపీ పార్టీ పైన బాబు కుటుంబం పైన బరితెగించి ప్రవర్తించారు. ఇక అటు తెలంగాణ రాజకీయాలలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు ఆ పార్టీలో ముఖ్య నేతలుగా ఉన్న అనేకమంది టీడీపీ తో ఏళ్లనాటి అనుబంధాన్ని మరిచి హద్దులు దాటుతున్నారు.

అయినా అటువంటి వారిని అడ్డుకోవడం విషయంలో టీడీపీ ఎందుకో వెనుకబడింది. జగన్ అండ్ కో తమ స్థాయిని మించి బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నా, కేసీఆర్ అండ్ కో తమ పరిధి దాటిన రాజకీయాలు చేస్తున్నా టీడీపీ మాత్రం తన స్థాయికి తగ్గ ప్రతిదాడి చేయలేకపోతోంది.

దీనికి కారణం ఏంటి.? అసలు ఈ విషయంలో టీడీపీ ముందున్న సమస్యేమిటి.? టీడీపీ వేగానికి బాబు అడ్డుకట్టలు వేస్తున్నారా.? తెలుగు తమ్ముళ్ల స్పీడ్ ని లోకేష్ నిరువరిస్తున్నారా.? లేక పార్టీ నేతలే పట్టీపట్టనట్టు రాజకీయం చేస్తున్నారా.?

జగన్ ను పల్లెత్తి మాట అంటే చాలు వైసీపీ అధినేత వైస్ జగన్ నుంచి ముక్కు ముఖం కూడా తెలియని ఆ పార్టీ క్యాడర్ వరకు అందరు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలపై చెలరేగిపోతారు. ముఖ్యంగా బాబు టార్గెట్ గా వైసీపీ చేసే విమర్శలు ఆయన స్థాయికి ఏమాత్రం తాగనివనే చెప్పాలి.

ఇక కేసీఆర్ సంగతి చెప్పనక్కరలేదు. బిఆర్ఎస్ నో, కేసీఆర్ నో విమర్శించాల్సిన పని లేదు, జగన్ కు వ్యతిరేకంగా రాజకీయం నడిపినా, వైసీపీ పై రాజకీయ పోరాటాలు చేసినా కేసీఆర్ నుంచి బాబు కి రిటర్న్ గిఫ్ట్ లు వచ్చేస్తున్నాయి, అలాగే బాబు నాయకత్వంలో ఏపీలో అభివృద్ధి చేసినా, నీటి ప్రాజెక్టులు నిర్మించినా బిఆర్ఎస్ నుంచి విమర్శలు విడుదలవుతాయి.

అటు ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ రప్ప రప్ప అంటు రెచ్చిపోతున్నా అధికారంలో ఉన్న టీడీపీ రఫ్ఫాడించలేకపోతుంది. అలాగే ఇటు పొరుగు రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బిఆర్ఎస్ నువ్వెంత అంటూ ఎంత రెచ్చకొడుతున్నా ప్రభుత్వంలో ఉన్న టీడీపీ ఏ మాత్రం రెచ్చిపోలేకపోతుంది.

ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలను ప్రతిపక్షాలు విమర్శిస్తాయి, అది వారి హక్కు కూడా…, అయితే ఆ హక్కు కేవలం రాజకీయ పరంగానే ఉండాలి, కానీ ఇక్కడ ఆ హక్కు కాస్త ఆధిపత్యంగా మారి రాజకీయాల నుంచి వ్యక్తిగత జీవితాల వరకు విమర్శలు శృతిమించుతున్నాయి.

మరి వాటికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చే ఉద్దేశం టీడీపీ కి లేదా.? అధికారంలో ఉన్నప్పుడు ఇలా సహనం – శాంతి అంటూ బాధ్యత పేరుతో మీనమేషాలు లెక్కించడం, ప్రతిపక్షంలో ఉంటే ఓర్పు – నేర్పు అంటూ చేతులు కట్టేసుకోవడం టీడీపీ కి అలవాటుగా మారిందా.? అంటూ పార్టీ మద్దతుదారులు పెదవి విరుస్తున్నారు.

అలాగే టీడీపీ సహనం – మౌనం ప్రత్యర్థులకు అస్త్రంగా మారకూడదని, టీడీపీ ఈ కంచెలు దాటి ప్రత్యర్థి పార్టీలకు అడ్డుకట్టలు వెయ్యాలని, ఆయా పార్టీల నేతల విమర్శలకు టీడీపీ తన స్థాయికి తగ్గ కౌంటర్లు ఇవ్వాలంటూ పార్టీ క్యాడర్ కోరుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories