నేడు భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్ గురించి చెప్పుకొంటున్నపుడు పొరుగు రాష్ట్రం తెలంగాణ… అక్కడి పార్టీలు, వాటి రాజకీయాల గురించి కూడా నాలుగు ముక్కలు చెప్పుకోవచ్చు.
ఏపీ, తెలంగాణ విడిపోయి 11 ఏళ్ళు. నేటికీ తెలంగాణలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉంది. 11 ఏళ్ళ తర్వాత కూడా వరంగల్‌తో సహా మిగిలిన విమానాశ్రయాల ప్రతిపాదనలు ఏవీ ముందుకు సాగలేదు!
కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే నేడు భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం నేడు ల్యాండింగ్ అయ్యింది. జూన్-జూలై నెలల నుంచి పూర్తిస్థాయిలో విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి.
ఏపీలో ఇంత వేగంగా అభివృద్ధి జరుగుతుంటే, తెలంగాణలో ఎందుకు ఇంకా ప్రారంభమే కావడం లేదు?అంటే కేసీఆర్ సృష్టించిన ప్రాంతీయంవాదం, కాంగ్రెస్, బిజేపిల శత్రుత్వం తెలంగాణకు శాపంగా మారిందని చెప్పవచ్చు.
కేసీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు, తన పార్టీకి ఎదురేలేకుండా చేసుకోవడానికి తెలంగాణవాదాన్ని ఆయుధంగా మలుచుకున్నారు. నేటికీ దాంతోనే బీఆర్ఎస్ పార్టీ మనుగడ సాగిస్తోంది.
కేసీఆర్ రాజకీయ దురాశతో కేంద్రంతో, ఇరుగు పొరుగు రాష్ట్రాలతో నిత్యం కయ్యానికి కాలుదువ్వుతూ తాను, తన పార్టీ ఏకాకిగా మారి, తెలంగాణని కూడా ఏకాకిగా మార్చేశారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే అంటూ కేసీఆర్ అనుసరించిన ఈ కయ్యమాడే విధానమే తెలంగాణ రాష్ట్రానికి శాపంగా మారిందని చెప్పక తప్పదు.
తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి బిజేపితో బద్దవైరం తెలంగాణకు మరో శాపంగా మారింది. అంతేకాదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అచ్చం బీఆర్ఎస్ పార్టీలాగే ఇటు ఆంధ్రాతో, అటు కేంద్రంతో యుద్ధాలు చేస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయవాదంతో రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని, ఆ పార్టీ కూడా నష్టపోయిందని తెలిసి ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాని బాటలోనే నడవడం మొదలుపెట్టింది.
టీడీపికి ఇద్దరు కేంద్ర మంత్రులున్నారు. సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ముగ్గురికీ కేంద్రంతో బలమైన సంబంధాలున్నాయి. కనుక సిఎం రేవంత్ రెడ్డి వారితో కూడా సఖ్యతగా ఉంటే వారు కూడా కేంద్రంతో మాట్లాడి తెలంగాణ అభివృద్ధికి సహాయపడేవారు. కానీ సిఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు నీళ్ళ విషయంలో సిఎం చంద్రబాబు నాయుడుపై కత్తులు దూస్తున్నారు.
తెలంగాణ పాలకులు ఈవిధంగా రాష్ట్ర ప్రయోజనాల పేరుతో ఆధిపత్యపోరు చేసుకుంటూ అందరితో కయ్యమాడుతూ శత్రువులుగా మార్చుకుంటుంటే ఇక ఎవరు మాత్రం తెలంగాణకి సాయం చేస్తారు? ఎలా అభివృద్ధి చెందుతుంది?
అందరితో కయ్యమాడటమే పార్టీల విధానంగా ఉన్నంత కాలం తెలంగాణ అభివృది ఇలాగే నత్త నడకన సాగుతుంది. ఇందుకు వరంగల్ విమానాశ్రయ ప్రతిపాదన అటకపై ఉండటమే చక్కటి ఉదాహరణ.
అయితే ఇందుకు తెలంగాణ పాలకులు, పార్టీలు ఎవరినో ద్వేషించడం, బూచిగా చూపిస్తూ తమ తప్పుని, వైఫల్యాలని వేరోకరిపై వేసి తప్పించుకుంటున్నాయి. ఈ విధంగా వ్యవహరిస్తుండటం వలన వాటికి ఎటువంటి నష్టమూ ఉండదు. కానీ తెలంగాణ రాష్ట్రం, ప్రజలు నష్టపోతూనే ఉంటారు.






