వైసీపీ అధికారానికి దూరమై ఇప్పటికి దాదాపు ఏడాదిన్నర గడిచినా ఇంకా ఆ పార్టీ నేతలు గెలుపు – ఓటముల మధ్యనే ఆగిపోయారు అనిపిస్తుంది. పార్టీ గెలుపు లో క్రిడిట్ మొత్తం జగన్ కే దక్కితే పార్టీ ఓటమిలో మాత్రం వైసీపీ వంద కారణాలను వెతుకుతుంది.
2019 ఎన్నికలలో వైసీపీ సాధించిన 151 సీట్లకు కర్త, కర్మ, క్రియ అన్ని కూడా వైస్ జగన్ మోహన్ రెడ్డే తీసుకున్నప్పుడు 2024 ఎన్నికలలో వైసీపీ పోగొట్టుకున్న 140 సీట్లకు కూడా పూర్తి బాధ్యత జగన్ దే అవుతుంది కదా. గెలుపులో క్రిడిట్ తీసుకుంటున్న జగన్ ఓటమిలో ఎందుకు డెబిట్ లోకి వెళుతున్నారు.?
అయితే జగన్ ఇక్కడ క్రిడిట్ చోరీ కోరుకుంటున్నారా.? గెలుపులో తీసుకున్న క్రిడిట్ ఓటమిలో జగన్ తీసుకోలేకపోతున్నారా.? ఇందు కోసం వైసీపీ సాకులు వెతుకుతూ మనిషికో కారణం చెపుతున్నారా.? వైసీపీ పార్టీ ముఖ్యనేతల నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ వరకు ఇప్పటికి తమ ఓటమికి గల కారణాలను వెతుకుతూనే ఉంటున్నారు, వాటిని వివిధ రూపాలలో వివరిస్తూనే వస్తున్నారు.
వైసీపీ కీలక నేత, జగన్ కు అత్యంత సన్నిహితుడు అయిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి వైసీపీ ఓటమికి ఈవీఎం లే కారణం అంటూ కుండబద్దలు కొడితే, మరికొందరు తమ ప్రభుత్వ హయాంలో పాలన మీద కంటే ప్రత్యర్థి పార్టీల మీద ఎక్కువ ఫోకస్ పెట్టడమే వైసీపీ ఘోర ఓటమికి కారణాలంటూ వాస్తవాన్ని ఒప్పుకుంటున్నారు.
ఇక ఒక వైసీపీ మాజీ ఎంపీ ఓ ఇంటర్ వ్యూ లో మాట్లాడుతూ పవన్ పై వైసీపీ చేసిన వ్యక్తిగత దాడి వైసీపీ ఓటమిని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిందన్నారు. ఇక మరికొంతమంది బాబు అరెస్టు కూడా వైసీపీ పతనానికి మార్గం సులభం చేసిందన్నారు. అలాగే కాలకేయ సైన్యంలా ప్రవర్తించిన వైసీపీ సోషల్ మీడియా కూడా ఈ ఓటమిలో కీలక పాత్ర పోషిందని మరికొందరు విశ్వసిస్తున్నారు.
కొడాలి నాని బూతులు, రోజా వెకిలి చేష్టలు, వల్లభనేని వంశీ నోటి దూల, పేర్ని నాని, అంబటి రాంబాబు అత్యుత్సాహం, సజ్జల సలహాలు, సాయి రెడ్డి ట్వీట్లు, పెద్ది రెడ్డి అరాచకాలు, అనిల్ కుమార్ దౌర్జన్యాలు, ద్వారంపూడి అక్రమాలు ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ ఓటమికి సవాలక్ష కారణాలు చెప్పుకోవచ్చు, చెప్పుకుంటున్నారు కూడా.
వీటికి తోడు జగన్ నియంతృత్వ ధోరణి, రాజధాని పై వైసీపీ మూడుముక్కలాట కూడా వైసీపీ వై నాట్ 175 ని 11 కి పరిమితం చేసిందని వైసీపీ నేతలు కూడా అంగీకరిస్తున్న మాట వాస్తవం. అయితే వైసీపీ ఓటమిలో మరోకీలక అంశం జగన్ సృష్టించిన వాలంటరీ వ్యవస్థ.
వాలంటరీ వ్యవస్థ వైసీపీ ని ఘోరంగా దెబ్బ తీసిందనే వాస్తవాన్ని ఇప్పటికే అనేకమంది వైసీపీ నేతలు బహిరంగానే ప్రకటించారు. ఇక ఇప్పుడు తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆ ప్రకటనను మరోసారి బలపరిచారు. ఇలా ఒక్క పార్టీ నుంచే ఆ పార్టీ ఓటమికి ఇన్ని భిన్నాభిప్రాయాలు బయటకు రావడం అంటే వైసీపీ ప్రభుత్వంగా ఫెయిల్ అయ్యిందని అర్థమా.?






