kcr_BRS Party President

నిజంగా కింగులాగే బ్రతికిన కేసీఆర్‌ దాదాపు 10 నెలలుగా ఫామ్‌హౌస్‌లో బందీగా ఉండిపోయారు. లిక్కర్ కేసులో నుంచి కూతురు కల్వకుంట్ల కవితని విడిపించుకొని తెచ్చుకునేసరికి ఎఫ్-1 రేసింగ్ కేసులో కొడుకు కేటీఆర్‌ జైలుకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తోంది. కేటీఆర్‌, హరీష్ రావులు కలిసి బిఆర్ఎస్ పార్టీని నడిపించగలుగుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయగలుగుతున్నారు. కానీ కూల్చలేకపోయారు.

నాయకుడు లేని బిఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉంది కనుకనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పాలన విజయోత్సవాలు కూడా చేసుకుంది. ఈ ఏడాది పాలనలో తెలంగాణ ప్రజలపై కేసీఆర్‌, బిఆర్ఎస్ పార్టీల ప్రభావాన్ని తగ్గించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమేమి చేయాలో అన్నీ చేస్తూనే ఉంది.

Also Read – అప్పుడే ఏపీ పూర్తిగా అభివృద్ధి చెందిన్నట్లు లెక్క!

ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమర్ధంగా పనిచేసి ప్రజలను మెప్పించగలిగి ఉంటే, కేసీఆర్‌ ప్రభావం నుంచి ప్రజలను తప్పకుండా బయటపడేలా చేయగలిగేవారు. కానీ రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ మార్క్ పాలన సాగిస్తుండటమే బిఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్షగా నిలుస్తోందని చెప్పవచ్చు.

కేసీఆర్‌ ఎలాగూ సంక్రాంతి తర్వాత మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్‌ అవుతారని బిఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. కనుక ఒకవేళ ఎఫ్-1 రేసింగ్ కేసులో కేటీఆర్‌ అరెస్ట్‌ అయ్యి జైలుకి వెళితే కేసీఆర్‌ బయటకు వచ్చి పార్టీని కాపాడుకుంటారా లేదా?అనేది మరికొన్ని రోజులలో ఎలాగూ చూస్తాము.

Also Read – ఎఫ్-1 కేసులో… జై తెలంగాణ దేనికి?

అయితే పదవీ, అధికారం, వైభోగాన్ని అనుభవించిన కేసీఆర్‌, ఈ వరుస దెబ్బలు తట్టుకోలేకనే పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు.

ఈ నేపధ్యంలో ఆయన బిఆర్ఎస్ పార్టీ పగ్గాలు కేటీఆర్‌, కల్వకుంట్ల కవిత, హరీష్ రావు ముగ్గురిలో ఎవరో ఒకరికి అప్పగించేసి అమెరికాలో మనుమడి వద్దకు వెళ్ళిపోవాలనుకుంటున్నారని ఇటీవల మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Also Read – టిడిపికి కోటి దండాలు.. సభ్యత్వాలు!

ఈ ఊహాగానాలు కేటీఆర్‌ చెవిన కూడా పడిన్నట్లున్నాయి. ఆయన వాటికి చెక్ పెట్టేందుకు “బిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి అక్టోబర్‌లో ఎన్నిక జరుగుతుంది. నేనే స్వయంగా కేసీఆర్‌ పేరుని అధ్యక్షుడుగా ప్రతిపాదిస్తాను. ఆయన నేతృత్వంలోనే బిఆర్ఎస్ పార్టీ ముందుకు సాగి మళ్ళీ అధికారంలోకి వస్తుంది,” అని అన్నారు.

కానీ ఒకవేళ కేటీఆర్‌ జైలుకి వెళితే, కేసీఆర్‌ తప్పుకోవాలనుకుంటే బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమవుతుంది? అంటే ఇంతకాలం కేసీఆర్‌పై నమ్మకంతో పార్టీని అంటిపెట్టుకొని ఉన్న సీనియర్ నేతలు వెంటనే కాంగ్రెస్‌, బీజేపిలోకి మిగిలినవారు టీడీపీలోకి వెళ్ళిపోవడం ఖాయం. బహుశః సిఎం చంద్రబాబు నాయుడు ఈ పరిణామాలు ఊహించే తెలంగాణలో టీడీపీని మళ్ళీ బలోపేతం చేసేందుకు సన్నాహాలు ప్రారంభిస్తున్నారేమో?




బిఆర్ఎస్ పార్టీకి 2024 ఎలాగూ చాలా చేదు అనుభవాలు మిగిల్చిపోయింది. కనీసం 2025 అయినా హ్యాపీ న్యూ ఇయర్ అవుతుందా లేక మరో 2024గా మారుతుందా? అంతా కేసీఆర్ నిర్ణయం మీదే ఆధారపడుంది.