పైకి మొసలి కన్నీళ్ళు.. లోలోన సంతోషం!

Women Reservation Bill Turns Into Political Drama

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్స్ బిల్లు తిరస్కరణకు గురైనందుకు దేశంలో అధికార విపక్షాలన్నీ మహిళలకు అన్యాయం జరిగిందంటూ చాలా బాధపడిపోతున్నాయి.

ఎన్డీయేలో టీడీపి, జనసేన భాగస్వాములు కనుక సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ ఈ బిల్లుని కాంగ్రెస్‌ మిత్రపక్షాలు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు.

ADVERTISEMENT

ఆలాగే దీంతో పాటు డీలిమిటేషన్‌ బిల్లు కూడా ఆగిపోయినందుకు ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీతో సహా దేశంలో విపక్ష పార్టీలన్నీ లోలోన సంతోషిస్తూనే ఉంటాయి. కానీ డీలిమిటేషన్‌తో శాసనసభ, లోక్‌సభ సీట్లు పెరిగితే వాటికీ లాభమే కదా? మరి ఆ బిల్లు ఆగిపోతే అవెందుకు సంతోషపడతాయి? అనే సందేహం కలుగక మానదు.

డీలిమిటేషన్‌తో పెరిగే సీట్ల వలన కలిగే లాభం కంటే ఆ పేరుతో అధికారంలో ఉన్న ప్రత్యర్ధి ప్రభుత్వాలు తమకు పట్టున, బలమైన నాయకులున్న నియోజకవర్గాలను ఎడాపెడా చీల్చి ముక్కలు చేసేస్తాయనే భయం, దాంతో ఎన్నికలలో నష్టపోతామనే ఆందోళన చెందడం సహజం.

కనుక సీట్లు పెరగకపోయినా పర్వాలేదు… డీలిమిటేషన్‌ కారణంగా ఉన్న సీట్లు నష్టపోకుండా, ఎన్నికలలో గెలిచి అధికారం దక్కించుకుంటే అదే పదివేలని అనుకోకుండా ఉండవు.

ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీ ఎట్టి పరిస్థితులలో వచ్చే ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావాలని, తప్పకుండా వస్తామని చాలా ఆశపడుతున్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాలలో విపక్ష పార్టీలు ఇంచు మించు ఇదే పరిస్థితిలో ఉంటాయి. కనుక డీలిమిటేషన్‌ ఆగిపోయినందుకు లోలోన సంతోషించకుండా ఉండవు.

ఏర్పీలో ‘రప్పా రప్పా.. మావిగన్‌’ అంటూ అగమ్యగోచరంగా ముందుకు సాగుతున్న వైసీపీ, తెలంగాణలో కేసీఆర్‌ పేరు, ఫోటో, పరపతితో మళ్ళీ అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్న బీఆర్ఎస్‌ పార్టీ నేతలు, కొత్త కుంపటి పెట్టుకుంటున్న కల్వకుంట్ల కవిత, ఇంకా దేశంలో ఇలాంటి పరిస్థితిలో ఉన్న విపక్ష పార్టీలన్నిటికీ అనూహ్యంగా ఈ మహిళా రిజర్వేషన్ అంశం చేతికి వచ్చింది.

ఈ పేరుతో అధికార, విపక్ష నేతలందరూ మీడియా ముందుకు వచ్చి మహిళలకు తీరని అన్యాయం జరిగిపోయిందని మొసలి కన్నీళ్ళు కార్చవచ్చు. దీంతో కొన్ని రోజులు లేదా వారాలపాటు రాజకీయ కాలక్షేపం చేసేయగలవు.

కానీ ఈ బిల్లుకి ఆమోదం లభించినా, లభించకపోయినా రాజకీయ పార్టీలు మహిళలకు 33 శాతం టికెట్స్, సీట్లు కేటాయిస్తే రాజ్యాంగ విరుద్దం కాదుగా? పార్లమెంటు, కోర్టులు కుదరదని చెప్పవుగా?

కానీ చట్టం చేస్తే తప్ప మహిళలకు 33 శాతం (టికెట్స్) సీట్లు ఎందుకు ఇవ్వాలనుకోవడం లేదు?అని ఎవరూ ప్రశ్నించరు. కనుక ఎవరూ ఇబ్బందికరమైన ఆ ప్రస్తావన చేయరు.

ఆయా పార్టీల మహిళా నాయకులు కూడా మీడియా ముందుకు వచ్చి తమ ప్రత్యర్ధి పార్టీల వలన మహిళలకు అన్యాయం జరిగిపోయిందంటూ నిరసనలు తెలుపుతున్నారు.

ఇంతకీ ఎవరికి ఎవరు అన్యాయం చేస్తున్నారు? ఎవరు నష్టపోతున్నారు? ఎవరు లాభపడుతున్నారు?

ADVERTISEMENT
Latest Stories