చట్టసభలలో 33 శాతం సీట్లు మహిళలకు కేటాయించేందుకు నిర్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లుని లోక్‌సభ ఆమోదించింది. నేడు రాజ్యసభ కూడా ఆమోదించడం ఖాయమే. దేశంలో దాదాపు అన్ని పార్టీలు దీనిని స్వాగతించాయి. కానీ అన్ని పార్టీలకు లోలోన గుబులే. ఒకేసారి 33 శాతం సీట్లు మహిళలకు కట్టబెట్టేయాలంటే ఎవరికీ మనసొప్పదు.
దీని కోసం తెలంగాణ సిఎం కేసీఆర్ కేసీఆర్ శాసనసభలో తీర్మానం చేసి, ప్రధానికి లేఖలు కూడా వ్రాశారు. ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత రెండు రోజులు ఢిల్లీలో దీక్షలు చేశారు. ఈ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందగానే వారు స్వాగతించారు. మోడీకి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. కనుక చట్టసభలలో మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని కేసీఆర్ చాలా ఆరాటపడుతున్నారని అర్దమవుతోంది.
కానీ ఇటీవల ఆయన ప్రకటించిన 115 మంది బిఆర్ఎస్ అభ్యర్ధుల తొలి జాబితాలో కేవలం ఏడుగురు మహిళలకు మాత్రమే టికెట్స్ ఖరారు చేశారు. మిగిలిన వారందరూ పురుషులే. అంటే ఆయన మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన లేదన్నమాట.
అయితే ఆయనొక్కరే కాదు దేశంలో అన్ని పార్టీలదీ ఇదే తంతు. లేకుంటే మహిళా రిజర్వేషన్ బిల్లు తేకపోయినా మహిళలకు సీట్లు కేటాయించడానికి ఎటువంటి అవరోదమూ లేదు. కానీ అన్నీ కలిసి ఎన్నికలను అత్యంత ఖరీదైనవిగా, ఓ పవర్ ప్లేగా మార్చేసినందున ఏ పార్టీ కూడా మహిళలను బరిలో దించి రిస్క్ తీసుకోవడంలేదు.
ఈ నేపధ్యంలో మహిళలకు తప్పనిసరిగా 33 శాతం టికెట్స్ కేటాయించాలంటే ఏ పార్టీకైనా పైకి ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీలోలోన గుబులుగానే ఉంటుంది.
ఉదాహరణకు ఏపీలో 175 శాసనసభ స్థానాలలో 57, లోక్‌సభ 25 స్థానాలలో 8 స్థానాలను మహిళలకే కేటాయించవలసి ఉంటుంది.
అదేవిదంగా తెలంగాణలో 119 స్థానాలకు 39 స్థానాలను, లోక్‌సభ 17 స్థానాలలో 6 స్థానాలను మహిళలకే కేటాయించవలసి ఉంటుంది.
అదే….యూపీలో 80, మహారాష్ట్రలో 48, పశ్చిమ బెంగాల్లో 42, బిహార్‌లో 40 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఆ లెక్కనే శాసనసభ సీట్లు కూడా భారీగా ఉన్నాయి.
వాటిలో 33 శాతం సీట్లు మహిళలకు కేటాయించాలంటే, వాటిని అనుభవిస్తూ ఇంతకాలం రాజకీయాలను శాశిస్తున్నవారి పరిస్థితి ఏమిటి? రాజకీయ నిరుద్యోగులుగా మారాబోయే వారి కోసం ఎన్ని పదవులు సృష్టించాలి? ఇంతకాలం ఏ పార్టీ కూడా మహిళ నేతలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు కనుక ఇకపై వారిని గుర్తించి, ఎన్నికలకు తయారుచేసుకోవాలి. ఇదో కొత్త సమస్య.
మహిళా రిజర్వేషన్ బిల్లుతో మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించి ఇప్పుడు వారు కూడా ఇరుక్కొన్నారు. కానీ పైకి చిర్నవ్వులు చిందిస్తూ స్వాగతించక తప్పడం లేదు. అయితే కొత్తగా మొదలయ్యే ఏ మార్పుకైనా మొదట్లో ఇటువంటి సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు తప్పవు. మరో 2-3 ఏళ్ళ వరకు ఈ బిల్లు అమలయ్యే అవకాశం లేదు కనుక అన్ని పార్టీలు అందుకే సంతోషపడి సర్దుకుపోవలసిందే. తప్పదు.



