యార్లగడ్డ- మరొక కరివేపాకు రాజకీయాల బాధితుడు

Yarlagadda Venkata Raoకృష్ణా రాజకీయాల్లో యార్లగడ్డ వెంకట్రావు రేపిన అలజడి అటు తిరిగి, ఇటు తిరిగి చివరికి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి, గన్నవరం తెదేపా ఇంచార్జ్ గా ప్రకటించడం వద్ద ఆగింది. ఎన్నో ఆశలతో అమెరికా నుంచి వచ్చి, పార్టీ ఆదేశాల మేరకు తనకు పరిచయాలు లేని గన్నవరంలో, వంశీ వంటి బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటూ పోరాడి తక్కువ సమయంలో తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. ఏ వంశీ మీదైతే పోరాడారో అదే వంశీని తెచ్చికుని అవసరం తీరాక వదిలించుకున్న తీరుపై ఇప్పుడు అంతటా చర్చ నడుస్తుంది. వాడుకుని అవసరం తీరాక కరివేపాకులా తీసిపారేసిన జగన్ వెన్నుపోటు రాజకీయంపై మరోసారి చర్చ జరిగింది.

వైసిపి అధినేత జగన్ రెడ్డి గురించి అందరూ అనే మాట ఒకటి ఉంది, తను చెయ్యాలనుకున్నవి, చేస్తున్నవి ఎదుటువాళ్ళ మీద ఆరోపణలు చెయ్యడం, తన వందిమాగాదులతో అది ప్రచారం చేపించడం, ఆ ప్రచారాల మాటున అవే పనులు తను చేసుకుంటూ పోవడం. ఆయన తండ్రి కూడా ఇటువంటి రాజకీయాలే చేసినా కాంగ్రేసులో ఉండే పరిమితుల వల్ల కొంత పరిధిలో ఉండేవి. ఇలా వైయస్ కాలం నుండి ఈ కాంప్ చంద్రబాబుపై వేసిన మచ్చ ‘వెన్నుపోటు’. జగన్, అతని పేటియం సోషల్ మీడియా కూడా ఇదే ప్రచారంతో టిడిపిపై వాదన మెుదలు పెడతారు. నిజానికి వైయస్ రాజకీయ జీవితం వెన్నుపోటుతో మెుదలైంది. రాజకీయంగా గుర్తింపునిచ్చిన కాంగ్రేసుకు కుల అభిమానంతో కష్టకాలంలో వెన్నపోటు పొడిచి రెడ్డి కాంగ్రెస్ లో చేరారని, అలాగే పదవి కోసం తొలిసారి అసెంబ్లీకి పంపిన రెడ్డి కాంగ్రెస్ కు వెన్నపోటు పొడిచి ఇందిరా కాంగ్రెస్ లో చేరారని ప్రత్యర్థులు ఆరోపిస్తారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ తనకు రాజకీయ జన్మనిచ్చి తొలిసారి చట్టసభలకు పంపిన కాంగ్రేసుకు పదవి కోసం వెన్నపోటు పొడిచి ఆ పార్టీ నాయకులను, కాడర్ ను లాక్కుని సొంత పార్టీ పెట్టారు. అలా మెుదలైన ఆయన వెన్నుపోటు రాజకీయాలు అంతులేని కధలా సాగుతున్నాయి.

ADVERTISEMENT

అధికారంలోకి వస్తూనే ప్రత్యేక హోదా అంటూ ఊరూ, వాడా గగ్గోలు పెట్టి యువతను ఆశ పెట్టి, కేంద్రంలో పూర్తి మెజారిటీ ఉంది మనమేమీ చెయ్యలేం అని యువతకు వెన్నపోటుతో మెుదలు పెట్టిన ఆయన, తరువాత కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా అమ్మఒడి ఇస్తాం అని చెప్పి తల్లులకు, సిపియస్ రద్దు అని ఉద్యోగులకు, జాబ్ కాలెండర్ అని నిరుద్యోగులకు, అమరావతే రాజధాని అని రైతులకు, సాగునీటి ప్రాజెక్టులు అంటూ రాయలసీమ వాసులను, ఇలా తనను నమ్మిన ప్రతి వర్గాన్ని మెూసం చేసారని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తారు. అలాగే నమ్మి వచ్చిన అనేక మంది నాయకులను కూడా వెన్నుపోటు పొడిచారని చెబుతారు.

ఆయన రాజకీయాల్లో అలా వెన్నుపోటు దెబ్బ తిన్న నాయకుల లిస్టు చాంతాడంత ఉంటుంది. తన తండ్రితో కలిసి నడచిన మైసూరా రెడ్డి మెుదలు, దివంగత సబ్బం హరి, కొణతాల, వంటి అనేకులు ఆయన రాజకీయాల పోటు రుచి చూసినవారే. ఇక తెలంగాణకు మద్దతుగా ఉత్తరం ఇచ్చి ఆ ప్రాంతంలో అనేక నాయకులకు ఆశలు కలిపించి, చివరకు బైల్ కోసం కాంగ్రేసుతో అవగాహనకు వచ్చి సమైఖ్యఆంధ్ర అని ఆ ప్రాంత నాయకులకు పెద్ద పోటు వేసారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసినా తరువాత అధికార పార్టీకి అనుకూలంగా ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా అక్కడి నాయకుల రాజకీయ జీవితానికి పోటు వేసారు. ఇక ఆంధ్రలో అయితే ముఖ్యంగా చెప్పుకునేది మర్రి రాజశేఖర్ గురించి. ఆయనకు మంత్రి పదవి ఆశపెట్టి యంయల్ఏ సీటు విడుదల రజనీకి ఇచ్చిన ఆయన, తరువాత మర్రిని నిండా ముంచి రజనీకి మంత్రి పదవి ఇచ్చి, చివరి సంవత్సరం వరకు నాన్చి మర్రికి యంయల్సీ ఇచ్చారు. అలాగే మంగళగిరి శాసనసభ్యుడు రామకృష్ణా రెడ్డి, ప్రతిపక్షంలో ఆయన ద్వారా అమరావతిపై అనేక కేసులు వేపించి అడుగడుగునా అడ్డుపడి, మంత్రి పదవి ఆశచూపి చివరికి మెుండి చేయి చూపారు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి వంటి అనేక ఉదాహరణలు. చివరికి సొంత చెల్లికి, తల్లికి కూడా వెన్నుపోటు పొడిచారని రాజకీయ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదే వరుసలో యార్లగడ్డ వెంకట్రావు వంతు. ఆయన వైయస్ అధికారంలోకి వచ్చేసరికే అమెరికాలో వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. ఆపై అమెరికా నుండి వచ్చి తన సొంత ప్రాంతం వచ్చే పెనమలూరు పరిధిలో సేవా కార్యక్రమాలు చేసుకుంటున్న ఆయన్ని, ఏమాత్రం పరిచయం లేని గన్నవరం ప్రాంతానికి పంపారు. అయినా పార్టీ ఆదేశాల మేరకు అక్కడికి వెళ్ళి శక్తి వంచన కృషి చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాని తొమ్మిది నెలలకే వంశీని పార్టీలోకి తెచ్చి వెంకట్రావుకు పొగపెట్టారు. కంటితుడుపుగా డిసిసిబి చైర్మన్ పదవి ఇచ్చినట్టే ఇచ్చి సంవత్సరంలో పీకేసారు. ఇక పార్టీలో తన స్ధానం నిత్యం పోరాడవలసి వచ్చింది. ఒకటి రెండు సందర్భాల్లో కలిసినప్పుడు వంశీతో కలిసి పనిచేయమని చెప్పడం తప్ప వెంకట్రావుకు ఎటువంటి ఊరటా లభించలేదు. తర్వాతి రోజుల్లో అపాయుంట్మెంటు కూడా ఇవ్వలేదు. పార్టీలో సీనియర్ అయిన దుట్టా రామచంద్రరావుతో కలిసి పోరాడినా ఎటువంటి ఫలితంలేక చివరికి పార్టీ వీడవలసి వచ్చింది. అలా జగన్ వెన్నుపోటు రాజకీయాల దెబ్బ రుచి నమ్మి వచ్చిన వెంకట్రావుకు తెలిసి వచ్చింది.

వెంకట్రావును గన్నవరం తెలుగుదేశం ఇంచార్జిగా ప్రకటించినందున దాదాపుగా ఆయనే అభ్యర్థి కావచ్చు. ప్రజల్లో ప్రస్తుతం ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, టిడిపికి వస్తున్న ఆదరణ, గతంలో స్వల్ప మెజారిటీతో ఓడిన విషయాలు గమనిస్తే, ఆయన గెలుపుకు అధిక అవకాశాలన్నాయి. వచ్చే ఎన్నికల్లో జగన్ కూడా గెలిస్తే వెంకట్రావు కోరుకున్నట్టు ఆయనను అసెంబ్లీలో కలుస్తారేమెూ!

-శ్రీకాంత్.సి

ADVERTISEMENT
Latest Stories