ఏపీ ప్రాజెక్టుల పై తెలంగాణ పెత్తనం అనడం కంటే కూడా బిఆర్ఎస్ అజమాయిషీ అనడం సబబేమో. గోదావరి, కృష్ణా మిగులు జలాల అనుసంధానమే బనకచర్ల ప్రాజెక్టు, అయితే ఈ ప్రాజెక్ట్ ను అడ్డుకుని తీరుతాం అంటూ అటు బిఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా ఏపీ ప్రభుత్వం పై ఉమ్మడి పోరుకి సిద్ధమయ్యారు.
అయితే ఏపీ ప్రాజెక్ట్ నిర్మాణం పై పొరుగు రాష్ట్ర రాజకీయ పార్టీలు ఇంతలా వ్యతిరేక స్వరం వినిపిస్తున్నా, న్యాయపోరాటానికి దిగుతాం అంటూ అంతలా హెచ్చరిస్తున్నా వైసీపీ అధినేత వైస్ జగన్ కు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం ఆశ్చర్యం.
అలాగే ఏపీ ప్రయోజనాల కోసం ఎందాకైనా పోరాడటం, ఎవ్వరితో అయినా కొట్లాడుతాం అంటూ మీడియా ముందు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైస్ షర్మిల బనకచర్ల ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు బదులు చెప్పలేకపోతున్నారు, బిఆర్ఎస్ చేసే రాజకీయాన్ని ఎదురు ప్రశ్నించలేకపోతున్నారు.
ఇలా ఇటు జగన్, వైసీపీ…అటు షర్మిల, కాంగ్రెస్ తమ రాజకీయ స్వార్దాల కోసం, తెలంగాణ రాజకీయ పార్టీలతో తమకున్న స్నేహ సంబంధాల కోసం సొంత రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి కూటమి ప్రభుత్వం పై మాత్రం రాజీ లేని రాజకీయ పోరాటం చేస్తున్నారు.
తన పార్టీ రాజకీయ ప్రయోజనాలు, తన వ్యక్తిగత ఇమేజ్ పెంపు పై పెట్టె శ్రద్ధతో ఒక్క శాతం జగన్ ఏపీ ప్రయోజనాల మీద పెట్టి ఉంటే నేడు తెలంగాణ రాజకీయాన్ని ఏపీ గట్టిగా తిప్పికొట్టగలిగేది.
తెలంగాణ ప్రయోజనాల విషయంలో అధికార, విపక్షాలు ఎలా అయితే ఒకే తాటి మీదకొచ్చి రాజకీయం చేస్తున్నాయో ఏపీలో కూడా అదే మాదిరి వైసీపీ తమ రెండు పార్టీల మధ్య ఉన్న రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వానితో సమానంగా కలిసి గళం విప్పాల్సి ఉంది.
కానీ వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ కానీ అందుకు సిద్ధంగా లేరు అనే సంకేతాలు ఇస్తున్నారు. రాయలసీమ జిల్లా ప్రజలకు తాగు నీటి కష్టాలు, అక్కడి రైతులకు సాగు నీటి వేదనలు లేకుండా చేయడానికి బాబు మొదలు పెట్టిన జలయజ్ఞంలో భాగమే బనకచర్ల ప్రాజెక్ట్.
అయితే కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ను సకాలంలో పూర్తి చేసి రాయాలసీమ నీటి కష్టాలను తీర్చగలిగితే ఆ ప్రాంతం మొత్తంలో వైసీపీ రాజకీయంగా జల సమాధి కావాల్సి ఉంటుంది. తమ దశాబ్దాల నాటి నీటి సమస్యకు బాబు శాశ్వత పరిష్కారం చూపితే అది కూటమికి ముఖ్యంగా టీడీపీ కి పెద్ద ఎత్తున రాజకీయ లబ్ది చేకూరుస్తుంది.
అదే వైసీపీ కి మింగుడుపడని అంశం కావడంతో తెలంగాణ లోని తన అజ్ఞాత స్నేహితుడు, తన పార్టీ శ్రోయోభిలాషి అయినా బిఆర్ఎస్ తో, ఆ పార్టీ నాయకులతో తెరచాటు రాజకీయానికి వైసీపీ తెరలేపిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నాడు రాష్ట్ర రాజధాని అమరావతి వినాశనానికి కూడా వైసీపీ, బిఆర్ఎస్ కలిసి చేసిన తెరచాటు రాజకీయమే కారణం అనేది రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున వినిపించిన ఆరోపణ. అయితే నాడు హైద్రాబాద్ అభివృద్ధి విస్తరణకు జగన్ ఎంచుకున్న మూడు రాజధానుల నిర్ణయం కూడా ఒక కారణంగా చెప్పుకున్నారు.
అప్పటి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ను బిఆర్ఎస్ భవిష్యత్ నాయకుడిగా నిలబెట్టడానికి హైద్రాబాద్ ప్రగతి బిఆర్ఎస్ కు అత్యంత కీలకం. అయితే టీడీపీ హయాంలో సన్ రైజ్ సిటీగా వెలుగొందిన ఏపీ, పెట్టుబడులకు మంచి ఆకర్షణీయమైన రాష్ట్రంగా పేరు గడించింది. కానీ వైసీపీ రాకతో, జగన్ నిర్ణయాలతో ఆంధ్రా పొలిమేర తొక్కడానికి కూడా పారిశ్రామిక వేత్తలు భయపడిపోయే స్థాయికి చేరుకున్నారు.
ఇదంతా కూడా పరోక్షంగా పొరుగున ఉన్న హైద్రాబాద్ మహా నగరానికి మరింత అనుకూలంగా మారడంతో హైద్రాబాద్ విస్తరణకు లైన్ క్లియర్ అయినట్టుగానే మారింది. గత ఐదేళ్లలో ఏపీకి రావాల్సిన పరిశ్రమలు, ఏపీ నుంచి తరలిపోయిన పరిశ్రమలకు హైద్రాబాద్ ఒక స్వర్గధామమయ్యింది.
ఇప్పుడు కూడా వైసీపీ, బిఆర్ఎస్ లు ఇదే ఫార్ములా తో బనకచర్ల మీద అనవసర రాజకీయం మొదలు పెట్టారా.? అందుకే బిఆర్ఎస్ ఎక్కడా తగ్గేదెలా అన్నట్టుగా దూకుడుగా వ్యవహరిస్తుంటే, వైసీపీ నాకేం సంబంధం అంటూ ఏమి పట్టనట్టు వ్యవహరిస్తుంది.
నాడు అమరావతి నిర్మాణాలు పూర్తి అయితే బాబు విజనరీ మరోసారి చర్చకొస్తుంది, టీడీపీ పాలన మరో ల్యాండ్ మార్క్ ను సృష్టింస్తుంది అన్న వైసీపీ రాజకీయ అభద్రతా రాష్ట్ర రాజధాని అమరావతిని పునాదులలోనే సమాధి చేసింది. నేడు బనకచర్ల విషయంలో కూడా వైసీపీ కి ఇదే అభద్రతా ఏర్పడిందా.?
అయితే అసలు ఈ బనకచర్ల ప్రాజెక్ట్ అనేది రెండు రాష్ట్రాల సమస్యా.? రెండు పార్టీల వివాదమా.? రెండు నదుల అనుసంధానమా.? అన్న విషయం పై అటు తెలంగాణ ప్రజలకు ఇటు ఆంధ్రా వాసులకు పూర్తి స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత, కర్తవ్యం కూటమి ప్రభుత్వం పై ఉంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆ దిశగా అడుగులు వేస్తూ ఈ ప్రాజెక్ట్ నిర్మాణ విధి విధానాలను వివరిస్తూ ఎప్పటికప్పుడు తెలంగాణ లేవనెత్తుతున్న అంశాల పై వివరణ ఇస్తున్నారు, అలాగే తన ప్రభుత్వంలోని మంత్రులను కూడా ఆ బాధ్యత తీసుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చారు.




