ఆంధ్రాలో వైసీపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లక్షలాదిమంది వాలంటీర్లతో ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకొంది. వారికి ప్రజాధనం నుంచి వందల కోట్లు జీతాలు చెల్లిస్తోంది. ప్రజలకు సేవ చేయడం కోసమే వారిని నియమించామని చెప్పుకొన్నప్పటికీ, వారు వైసీపి కోసమే పనిచేస్తున్నారనే విషయం ప్రజలందరికీ తెలుసు. స్వయంగా మంత్రులే చాలాసార్లు కూడా చెప్పుకొన్నారు కూడా.
ఆ మద్యన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై తీవ్ర ఆరోపణలు చేసినప్పుడు వారికంటే ముందు వైసీపి నేతలే భుజాలు తడుముకోవడం అందరూ చూశారు. అయితే రాష్ట్రంలో ప్రతిపక్షాలు కానీ, మార్గదర్శి, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులపై ప్రత్యేక శ్రద్ద చూపుతూ కేసులు వేసే ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి మేధావులు గానీ వాలంటీర్ వ్యవస్థపై అభ్యంతరం చెప్పకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
వాలంటీర్ వ్యవస్థ సృష్టించడానికి అసలు కారణం ప్రజల వ్యక్తిగత వివరాలను సేకరించి వైసీపికి తోడ్పడటం, లబ్ధిదారులు పక్క చూపులు చూడకుండా పట్టి ఉంచడం, సంక్షేమ పధకాల గురించి ప్రచారం చేస్తూ వైసీపికి రాజకీయ లబ్ధి కలిగించడం, ఎన్నికల ప్రక్రియలో వైసీపికి సహాయపడటమే అని ఇప్పటికే స్పష్టమైంది.
చట్టబద్దత లేని వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశించినప్పటికీ, వైసీపి ప్రభుత్వం వారిని వినియోగించుకొంటూనే ఉంది. ఇందుకు తాజా నిదర్శనంగా విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో ఆరో వార్డులో వైసీపి నేతలతో కలిసి వాలంటీర్లు ఇంటింటికీ ప్రచారం చేశారు.
వైసీపి చేపట్టిన ‘ఏపీకి జగనే ఎందుకు కావాలి?’అనే కార్యక్రమంలో భాగంగా వైసీపి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాల గురించి ఆరో వార్డులో ప్రజలకు వివరిస్తూ, వాటికి సంబందించి కరపత్రాలు పంచిపెట్టారు. బొబ్బిలి పట్టణ వైసీపి అధ్యక్షుడు చోడిగంజి రమేశ్ నాయుడు అధ్వర్యంలో వైసీపి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో పాటు వాలంటీర్లు కూడా ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పధకాల గురించి ప్రచారం చేశారు. అంటే వాలంటీర్లను ఏర్పాటు చేసుకొన్నది వైసీపి కోసమేనని స్పష్టమయ్యింది కదా?




