వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారం అడ్డుపెట్టుకుని జగన్ మోహన్ రెడ్డి లక్షల కోట్లు వెనకేసుకున్నారని, బెంగుళూరులోని జగన్ నివాసం, హైదరాబాద్ లోని లోటస్ పాండ్ ఇందుకు సజీవ సాక్ష్యాలంటూ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. రాజకీయ నాయకుల విమర్శలను పక్కన పెడితే, ఈడీ జగన్ ఆస్తులను ఇప్పటికే వేల కోట్లలో స్వాధీనం చేసుకుంది.
తాజాగా జగన్ అక్రమాస్తులపై కడప జిల్లా, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి స్పందించారు. జగన్ సొంతూరు అయిన పులివెందుల వేదికగా గుట్టంతా విప్పుతానని సంచలన ప్రకటన చేసిన ఆది, “తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ సంపాదించింది లక్ష కోట్లు అయినప్పటికీ, ఆ అక్రమార్జనకు ఒక రూపాయి వడ్డీ వేసినా 6 లక్షల కోట్లు అవుతుందని” తీవ్ర ఆరోపణలు చేసారు. మొన్నటివరకు వైసీపీలో ఉన్న తానూ జగన్ పని పట్టడానికే తెలుగుదేశం పార్టీలో చేరానన్న అభిప్రాయాలను వ్యక్తపరిచారు.



