అనంతపురం అర్బన్ వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి అనుచరులు పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించి అక్కడ విధులు నిర్వహిస్తు ఒంటరిగా ఉన్న రాధ అనే మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేశారు.
పట్టణంలో నవోదయకాలనీలో గుజ్జల సురేష్ అనే వ్యక్తి అక్రమంగా మద్యం అమ్ముతుండగా ఎక్సైజ్ పోలీసులు అతనిని అరెస్ట్ చేసి, 96 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొన్నారు. ఈ విషయం తెలుసుకొన్న 32వ డివిజన్ కార్పొరేటర్ సాకే చంద్రశేఖర్, మరో కార్పొరేటర్ కమల్‌హాసన్ భూషణ్, వాలంటీర్లు హర్షవర్ధన్ రెడ్డి, నూర్ మహమ్మద్, అనిల్ కుమార్, ఆర్య వర్ధన్, మరికొందరు వైసీపీ కార్యకర్తలను వెంటబెట్టుకొని సుమారు 16 మంది కలిసి బుదవారం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళారు. ఆ సమయంలో రాధమ్మ అనే ఓ మహిళా కానిస్టేబుల్ ఒక్కరే స్టేషన్లో ఉన్నారు.
గుజ్జల సురేష్ కేసు గురించి మాట్లాడటానికి వచ్చామని చెపుతూ వారిలో కార్పోరేటర్ సాకే చంద్రశేఖర్ వెళ్ళి సబ్ ఇన్‌స్పెక్టర్ కుర్చీలో కూర్చొన్నారు. ఆయనను అక్కడ కూర్చోవద్దని బయట కుర్చీలో కూర్చోవాలని కానిస్టేబుల్ రాధమ్మ చెప్పింది. స్టేషన్లో తాను ఒక్కదానినే ఉన్నానని కనుక సబ్ ఇన్‌స్పెక్టర్ వచ్చే వరకు అందరూ బయటకు వేచి ఉండాలని చెప్పగా, వారిలో కొందరు ‘మమ్మల్నే బయటకు పొమ్మంటావా… మేమేవరమో తెలిసే మాట్లాడుతున్నావా…” అంటూ ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు.
ఆమె ఫిర్యాదు మేరకు అనంతపురం రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో వారందరిపై ఎఫ్ఐఆర్ (నంబర్: 145/23) కింద సెక్షన్స్ 322,186,506,509 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఒత్తిడి మేరకు పోలీసులు వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ కార్యకర్తలను తప్పించేసి నలుగురు వాలంటీర్లు హర్షవర్ధన్ రెడ్డి, నూర్ మహమ్మద్, అనిల్ కుమార్, ఆర్య వర్ధన్‌లపై కేసు నమోదు చేసిన్నట్లు సమాచారం.
వైసీపీ అధికారంలోకి వస్తే దశలవారీగా రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుచేస్తానని చెప్పగా ఈవిదంగా ఎక్కడికక్కడ అక్రమ మద్యం విక్రయిస్తున్నారు. అక్రమంగా మద్యం అమ్మడమే ఓ నేరం. మళ్ళీ పోలీస్ స్టేషన్‌లో డ్యూటీలో యూనా కానిస్టేబుల్ రాధమ్మపై దౌర్జన్యం చేయడం ఇంకా నేరం. ఈ నేరంలో వాలంటీర్లు కూడా పాల్గొనడం గమనిస్తే వారి గురించి పవన్ కళ్యాణ్ వాదనలు నిజమే అని అర్దమవుతోంది.
అధికార పార్టీలో ఉంటే, పోలీస్ స్టేషన్‌లో దూరి ఒంటరిగా ఉన్న తనపై దౌర్జన్యం చేయవచ్చా?అని మహిళా కానిస్టేబుల్ రాధమ్మ ప్రశ్నకు మహిళా హోంమంత్రి తానేటి వనిత ఏం సమాధానం చెపుతారు? ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడే రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఏం చెపుతారు?అని నారా లోకేష్ ప్రశ్నిస్తున్నారు.



