దిగిపోవాల్సి వచ్చినా బాధపడను… వైరాగ్యమా… అస్త్ర సన్యాసమా?

YS Jagan Ready To Accept Defeat

ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి తిరుపతిలో బుధవారం జరిగిన ‘ఇండియా టుడే’ నిర్వహించిన విద్యా సదస్సులో పాల్గొనప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చినా నేను బాధపడను. ఎందుకంటే గత నాలుగున్నరేళ్ళలో రాష్ట్రంలో కోట్ల మందికి నేను శక్తికొద్దీ మేలు చేశాను. నాకు ఆ తృప్తి చాలు. గత ఎన్నికలలో మా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలుచేశాం కనుకనే దానిని ప్రజలకు చూపించి మళ్ళీ ఓట్లు అడగుతున్నాము,” అని అన్నారు.

”ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 175 సీట్లు ఖచ్చితంగా మనమే గెలుస్తామని నమ్మకంగా చెప్పాల్సిన ఈ సమయంలో ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సి వచ్చినా బాధపడను…” అని వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి చెప్పడం యుద్ధానికి ముందు ఓటమిని అంగీకరించడమే కదా?

ADVERTISEMENT

నాలుగున్నరేళ్ళుగా సంక్షేమ పధకాల పేరుతో లక్షల కోట్లు జనాలకు పంచిపెడుతున్నారు. రాష్ట్రంలో రంగులు, స్టిక్కర్స్, పేర్లు మార్పు, కూల్చివేతలు, ప్రతిపక్షాలపై కేసులు, అరెస్టులు కల్చర్ ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేస్తున్నారు.

మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల ప్రజలను విడదీసి టిడిపి, జనసేనలను దెబ్బకొట్టాలనుకున్నారు. చివరికి విశాఖ రాజధాని పేరుతో ఉత్తరాంధ్రా జిల్లాలలోనైనా పూర్తి పట్టు సాధించాలనుకున్నారు.

రాంగోపాల్ వర్మ, పోసాని వంటివారిని రంగంలో దించి రకరకాల ‘వ్యూహాలు’ అమలుచేస్తూనే ఉన్నారు. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏవీ ఫలించడం లేదనే వైరాగ్యం జగన్‌ మాటలలో కనిపిస్తోంది. ప్రసూతీ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యంలాగ దీనిని ఎన్నికల వైరాగ్యమని అనుకోవాలేమో?

ఇవే కాక టిడిపి, జనసేనలు కలవకుండా అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అవడం, ఈ కారణంగా రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం వాటి వైపు మొగ్గుచూపుతుండటం, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై పెట్టిన కేసులు బెడిసి కొడుతుండటం, ఎన్నికలకు ముందు హటాత్తుగా సొంత చెల్లెలు షర్మిల ఏపీలోకి ఎంట్రీ ఇచ్చి తనపై చేస్తున్న విమర్శలు, ఆరోపణలు, ఏపీలో ఇంత రాజకీయ రచ్చ జరుగుతున్నా మోడీ, అమిత్ షాలు ప్రేక్షక పాత్రకు పరిమితం అవడం వంటివి జగన్‌ వైరాగ్యానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.

ఈ వైరాగ్యంతో ఎన్నికలకు ముందు చెప్పిన ‘ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సి వచ్చినా బాధపడను…’ అనే ఈ చిన్న మాట పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఖచ్చితంగా తప్పుడు సంకేతాలు పంపిన్నట్లయిందని చెప్పక తప్పదు. ఈసారి ఎన్నికలలో వైసీపికి ఓటమి తప్పదని తాను కూడా మానసికంగా సిద్దపడి, పార్టీ నేతలను కూడా మానసికంగా సిద్దం చేస్తున్నట్లున్నాయి జగన్‌ మాటలు.

ఇటువంటి మాటలు ఎన్నికలకు ముందు అస్త్ర సన్యాసం చేయడంగానే చూడవచ్చు. అలనాడు కురుక్షేత్ర యుద్ధ రంగంలో అర్జునుడు అస్త్ర సన్యాసం చేస్తే, శ్రీకృష్ణుడు ధైర్యం చెప్పి యుద్ధం చేయించి పాండవులని గెలిపించాడు. కానీ ఎన్నికలకు ముందు అస్త్ర సన్యాసం చేసిన జగన్మోహన్‌ రెడ్డిని ఆదుకునేందుకు ఏ కృష్ణుడూ లేడు!

నిజానికి తానే శ్రీకృష్ణుడులా తన పార్టీ నేతలకు ధైర్యం చెప్పి ముందుకు నడిపించాల్సి ఉండగా, ఎన్నికలకు ముందు తన సేనలపై నమ్మకం కోల్పోయి చేజేతులా చెల్లాచెదురుచేసుకుంటూ ఇదే గొప్ప ‘వ్యూహం’ అని భ్రమిస్తూ, అందరినీ భ్రమింప జేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇది భ్రమ అనే వాస్తవం జగన్‌ గ్రహించిన్నట్లే ఉన్నారు. అందుకే ఈ వైరాగ్యం… అస్త్ర సన్యాసం అనుకోవాలేమో?

ADVERTISEMENT
Latest Stories