ధృతరాష్ట్రుడు, గాంధారిలాగే వైసీపి కూడా?

YS Jagan Andhra Pradesh Assembly

అలనాడు ధృతరాష్ట్రుడు కళ్ళు లేక లోకాన్ని చూడలేకపోతే, భర్త చూడని లోకాన్ని తాను కూడా చూడకూడదనుకున్న గాంధారి కళ్ళకు గంతలు కట్టుకుని జీవితాన్ని చీకటి చేసుకుంది. ప్రస్తుతం వైసీపి పరిస్థితి కూడా ఇదే!

జగన్‌ తాను అర్జునుడినని చెప్పుకుంటున్నప్పటికీ, ధృతరాష్ట్రుడులా వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు. ఏపీ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలలో నిన్న జగన్‌ ప్రసంగం విన్నప్పుడు తప్పులు, పాపాలను ఇంత చక్కగా సమర్ధించుకోవచ్చా?అని అనిపించకమానదు.

ADVERTISEMENT

అప్పుల గురించి ప్రతిపక్షాలు, కేంద్ర ఆర్ధికమంత్రి చెపుతున్నవన్నీ అబద్దాలేనట! రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, అప్పులు, నెలకొన్న అరాచక పరిస్థితులు, పెరుకుపోయిన సమస్యల గురించి, ఈ కారణంగానే తన పాలన పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగిందని జగన్‌కే బాగా తెలుసు. అందుకే ఎమ్మెల్యేలు, ఎంపీలను మార్చుకుంటున్నారు కదా?

జగన్‌ ప్రజల కళ్ళకు గంతలు కట్టాలని ప్రయత్నించడాన్ని అర్దం చేసుకోవచ్చు. కానీ నేటికీ ప్రజలు మనవైపే ఉన్నారంటూ జగన్‌ తన మంత్రులు, ఎమ్మెల్యేల కళ్ళకు కూడా గంతలు కట్టాలనుకోవడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే వారిని గాంధారిలా కళ్ళకు గంతలు కట్టుకొని తన చేయి పట్టుకుని నడవమని చెపుతున్నరనుకోవచ్చు.

రాష్ట్రానికి పెద్దగా ఆదాయం లేకపోయినా, కోవిడ్ కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దెబ్బ తిన్నప్పటికీ, పెద్దగా అప్పులు చేయకుండానే లక్షల కోట్లతో సంక్షేమ పధకాలు అమలుచేస్తూ బడుగు బలహీనవర్గాలకు ‘మేలు’ చేస్తూన్నారట! ఎలా సాధ్యం?

ప్రభుత్వం పంచాయితీ నిధులను పక్కదారి పట్టించిందని శాసనసభ బయట సర్పంచ్‌లు ఆందోళనలు చేస్తుంటే, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దివ్యంగా ఉందని శాసనసభలో జగన్‌ నిబ్బరంగా అబద్దాలు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్ధిక పరిస్థితి బాగుంటే పంచాయతీ నిధులను ఎందుకు వాడేసుకున్నట్లు?

నవ రత్నాల పేరుతో ప్రజలకు సంక్షేమ పధకాల వల వేసే రాష్ట్రంలో వైసీపికి అధికారంలోకి రాగలిగింది. వాటన్నిటినీ అమలుచేస్తున్నామని, అది తమ గొప్పదనం అని కూడా స్వయంగా చెప్పుకున్నారు. మరి అటువంటప్పుడు టిడిపి హామీలు ఇస్తే అది నేరం ఎలా అవుతుంది?

న్యాయం, ధర్మం, మాట తప్పని నైజంతో తాను రాజకీయాలు చేస్తూ ప్రజాధరణ పొందుతుంటే, చంద్రబాబు నాయుడు, ఓ జాతీయ పార్టీ (బీజేపీ)తో ప్రత్యక్షంగా, మరో జాతీయ పార్టీ (కాంగ్రెస్‌)తో రహస్య అవగాహన చేసుకుని కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారట!

ఆనాడు 2019 ఎన్నికలలో చంద్రబాబు నాయుడుని గద్దె దించడం కోసం కేసీఆర్‌తో కలిసి కుట్రలు పన్నారు. ఆయనపై ఆగ్రహంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా యధాశక్తిన వైసీపి గెలుపుకి తోడ్పడింది. ఇంకా వ్యూహాల పేరుతో ఐప్యాక్ చేసిన కుట్రలు, దుష్ప్రచారం చేసింది.

టిడిపిని ఓడించిన తర్వాత కూడా అది రాష్ట్రంలో మళ్ళీ బలపడి అధికారంలోకి రాకుండా నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టించడంతో సహా, ఈ 57 నెలల్లో జగన్‌ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు.

మోడీ, అమిత్ షాలను ఎలాగైనా ప్రసన్నం చేసుకుని, టిడిపి, జనసేనలవైపు మొగ్గకుండా ఉంచేందుకు మొన్ననే విజయసాయి రెడ్డి రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని అవహేళన చేస్తూ మాట్లాడారు. పరామర్శ పేరుతో కేసీఆర్‌ సాయం కొరివచ్చారు. ఎప్పటిలాగే ఐప్యాక్ తెర వెనుక ‘పని’ చేస్తూనే ఉంది.

చేయకూడని తప్పులు, పాపాలు, కుట్రలు, కుతంత్రాలన్నీ చేస్తూనే, శాసనసభలో న్యాయం, ధర్మం, నీతి నిజాయితీ అంటూ మాట్లాడటానికి చాలా ధైర్యం ఉండాలి. ఏమీ చేయకపోయినా అన్నీ చేశామని చెప్పుకోవడానికి చాలా ధైర్యం ఉండాలి కదా?

ADVERTISEMENT
Latest Stories