అరె… జగన్ కు అప్పుడే నమ్మకం పోయిందా..?

YS Jagan CBI Enquiry Corruption Casesనిన్న మొన్నటి వరకు సీబీఐ ఎంక్వయిరీనే అల్టిమేట్ అన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తాజాగా మాట మార్చారు. ఇప్పుడు ‘సీబీఐ’ స్థానంలోకి ఏకంగా ‘దేవుడు’ని తీసుకువచ్చారు. ఇటీవల పదవ తరగతి పరీక్ష పేపర్లు లీక్ కావడం, రాజకీయంగా పెద్ద సంచలనం అయ్యింది. ఈ ప్రభావం అసెంబ్లీ సమావేశాలపై పడగా, అప్పుడు ప్రసంగించిన వైఎస్ జగన్… “ఈ లీకేజ్ వ్యవహారంపై సీబీఐ ఎంక్వయిరీ వేయాలని, సీబీఐ అయితేనే నిజాలు బయటకు తీసుకువస్తుందని” అసెంబ్లీలో బల్లగుద్ది మరీ డిమాండ్ చేసారు.

అంతలా విశ్వాసం వ్యక్తం చేసిన అదే సీబీఐపై నేడు మాత్రం మరో మాట మాట్లాడడం జగన్ మార్క్ రాజకీయంగా మారింది. తన తండ్రి బ్రతికున్నంత వరకు తనపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, ఆ తర్వాత రాజకీయంగా తనను ఇబ్బందులకు గురి చేసేందుకు కేసులు పెట్టారని, ఇవన్నీ కూడా పైన దేవుడు చూస్తున్నాడని, అన్నీ ఆయనకు తెలుసని, కొత్తగా వీళ్ళు నన్నేమీ చేయలేరని వేదాంత ధోరణిలో మాట్లాడారు జగన్. ఒక్క మాటలో చెప్పాలంటే… ఇప్పటివరకు తనపై నమోదు చేసిన సీబీఐ కేసులన్నీ, బూటకపు కేసులుగా అభివర్ణించారు.

ADVERTISEMENT

సరే… జగన్ అన్నదే నిజమని భావిస్తే… మరి ఇప్పటివరకు ఈ అక్రమాస్తుల కేసుల్లో ఈడీ అటాచ్మెంట్ చేసుకున్న ఆస్తులపై జగన్ ఎందుకు నోరు మెదపడం లేదు? ఈ కేసులలో సదరు ఆస్తులు భాగం కాకపోతే, తన వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ ఎందుకు అటాచ్ చేస్తుందని పోరాటం చేయడం లేదు. ఈడీ అటాచ్మెంట్ ప్రకటన చేసినప్పుడల్లా, తానూ, తన మీడియా ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదు? ఇవన్నీ అధికార పక్షానికి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ, ప్రజల మదిలో నెలకొన్న ఇలాంటి అనేక అనుమానాలను నివృత్తి చేసిన నాడే జగన్ పై నమ్మకం కలుగుతుందని గుర్తించాలి.

తన వరకు వచ్చేసరికి… సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రాజకీయ పరమైన ఒత్తిడిలకు లొంగిపోయి, కేసులను నమోదు చేస్తుందని చెప్తుంటారు. ఇదే నిజమైతే, నాడు పరిటాల రవి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జగన్ “క్లీన్ చీట్” వెనుక కూడా రాజకీయ పరమైన ఒత్తిడిలు ఉన్నాయా? అన్న ప్రశ్నలు కలుగక మానవు. ఇలాంటి ప్రశ్నలకు కూడా జగన్ జవాబు చెప్తే, అప్పుడు జనం కూడా జగన్ వెంట ఉండే ఆస్కారం ఉంటుంది గానీ, ఇలా ఒక్క సీబీఐ పైనే పూటకో అభిప్రాయం వ్యక్తం చేస్తే మాత్రం, మరిన్ని ఇబ్బందికర పరిస్థితులను జగన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పకతప్పదు.

ADVERTISEMENT
Latest Stories