తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ‘క్విడ్ ప్రోకో’కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్పడ్డారని రెండెంకల సంఖ్యలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. అప్పటివరకు సామాన్యులకు తెలియని ‘క్విడ్ ప్రోకో’ అన్న పదానికి అర్ధం జగన్ వలన అందరికీ తెలిసివచ్చింది. అయితే తాజాగా ఇదే పదాన్ని కౌంటర్ చేసేందుకు టిడిపి అధినేత కుటుంబంపై జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు కుటుంబానికి సంబంధించిన హెరిటేజ్ రిటైల్ విభాగాన్ని ఫ్యూచర్ గ్రూప్ సంస్థ దక్కించుకోవడాన్ని ఆధారంగా చేసుకుని జగన్ ఈ ఆరోపణలు చేసారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు కుటుంబం నల్లధనాన్ని తెల్లగా మార్చుకుంటున్నారంటూ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. అయితే జగన్ చేసిన ఈ విమర్శలను నారా లోకేష్ సీరియస్ గా పరిగణించి, గట్టిగా బదులిచ్చారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కాకుండా హెరిటేజ్ సంస్థ తరపున ప్రసంగిస్తున్నాను… అంటూ ప్రారంభించిన లోకేష్, “వైఎస్ జగన్ ఆలోచనలు ఎప్పుడూ ‘క్విడ్ ప్రోకో’ చుట్టే తిరుగుతాయని” కౌంటర్ ఇచ్చారు.
“కంపెనీలు పెట్టి అవి ఉత్పత్తి ప్రారంభించకముందే, వాటి షేర్లను అమ్మిన ఘనత జగన్ దని, సాక్షి పేపర్ ముద్రించకముందే వాటి షేర్లను ప్రీమియం ధరలకు విక్రయించిన విధానాన్ని” నారా లోకేష్ తూర్పారబట్టారు. “బ్లాక్ మనీని వైట్ గా ఎలా చేయాలో జగన్ దగ్గరే నేర్చుకోవాలని, ‘క్విడ్ ప్రోకో’ పేటెంట్ హక్కులు జగన్ కు మాత్రమే సొంతమని” వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, హెరిటేజ్ సంస్థ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ మూడు సార్లు అధికారంలో, రెండు సార్లు ప్రతిపక్షంలో ఉందన్న విషయాన్ని గుర్తు చేసారు.
జగన్ మాదిరి ‘క్విడ్ ప్రోకో’కు పాల్పడే నీచ సంస్కృతి తమకు లేదని, ఫ్యూచర్ గ్రూప్ సంస్థకు అలాంటి ఖర్మ మాకు పట్టలేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు లోకేష్. ఓ పక్కన తనపై ‘క్విడ్ ప్రోకో’ కేసులు నమోదై ఉన్న తరుణంలో, అవే ఆరోపణలను ప్రత్యర్ధులపై గుప్పిస్తే… అవి ‘బూంరాంగ్’ అయ్యి తన దగ్గరికే వస్తాయన్న కనీస అవగాహన లేకుండా జగన్ రాజకీయ ఆరోపణలు చేస్తున్నారనేది విశ్లేషకుల మాట. అదే కదా “వైసీపీ అధినేత స్పెషాలిటీ” అంటున్నారు రాజకీయ వర్గీయులు.



