సింహం భయపడితే ఎలా?

ys-jagan

అడవికి రారాజు సింహం. అలాగే ఆంధ్రాకు తాను కూడా అని జగన్‌ అనుకుంటారు. తాను సింహంలా సింగిల్‌గా వస్తుంటే ప్రత్యర్దులు తోడేళ్ళ గుంపుల్లా వస్తున్నారంటూ జగన్‌ బటన్ నొక్కిన ప్రతీసారీ చెప్పుకుంటూనే ఉంటారు.

ADVERTISEMENT

జగన్‌ తనని తాను సింహంతో పోల్చుకుంటున్నారు కనుక దానిలాగే ధైర్యంగా పోరాడాలి. కానీ ప్రజలకు దూరంగా పరదాల మాటున సాగిపోతూ, పచ్చటి చెట్లను నరికించేస్తూ సభలు నిర్వహిస్తారు. ప్రజల మద్యకు వెళ్ళాలంటే భయపడుతూ మళ్ళీ ‘మీరే మీ ఈ బిడ్డను ఆదుకోవాలంటూ…’ అదే ప్రజలను జగన్‌ వేడుకొంటుండటం మరీ విచిత్రంగా ఉంటుంది.

ఈ నాలుగున్నరేళ్ళలో జగన్మోహన్‌ రెడ్డి ఒక్కసారి కూడా ప్రెస్‌మీట్‌ పెట్టి విలేఖరులతో ముఖాముఖీ మాట్లాడలేదు. జగన్‌ సభలైనా, సమావేశాలైనా ఎంతసేపు ‘నేను మాట్లాడుతాను… మీరు వినండి…’ టైపులోనే ఉంటాయి.

తన పాలనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎంతగానో అభివృద్ధి చెందిందని, దేశానికే ఆదర్శంగా నిలిచిందని, రాష్ట్రంలో 97 శాతం ప్రజలకు మేలు చేసేశానని చెప్పుకుంటున్నప్పుడు ప్రెస్‌మీట్‌ పెట్టి విలేఖరులతో మాట్లాడేందుకు భయం దేనికి?

తోడేళ్ళ గుంపుని చీల్చిచెండాడేస్తానంటున్న సింహానికి ప్రజలను, ప్రతిపక్షాలను చూస్తే అంత భయమెందుకు?అంటే సమాధానం లభించదు.

ఈ లెక్కన సింహం కంటే ఆడపులి (వైఎస్ షర్మిల) చాలా ధైర్యవంతురాలనే చెప్పవచ్చు. ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడటానికి ఎన్నడూ భయపడరు. స్వయంగా ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ విలేఖరుల ప్రశ్నలకు ధైర్యంగా జవాబులు చెపుతుంటారు.

అలాగే జనం మద్యకు వెళ్ళేందుకు అసలే భయపడరు. ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టగానే వైఎస్ షర్మిల జిల్లా పర్యటనలతో ప్రజల మద్యకు వచ్చేశారు.

అన్న జగన్మోహన్‌ రెడ్డిని పరిపాలన, రాష్ట్రాభివృద్ధి గురించి సూటిగానే ప్రశ్నిస్తున్నారు. కానీ జగన్‌ మాత్రం ఆమెను నేరుగా విమర్శించలేకపోతున్నారు. ఆమెను ఉద్దేశ్యించి ‘కాంగ్రెస్‌ స్టార్ క్యాంపెయినర్‌’ అంటూ పరోక్షంగా విమర్శిస్తున్నారు.

అసలు సొంత చెల్లి తనపై ఎందుకు కత్తి దూస్తోంది?అంటే దానికీ సూటిగా సమాధానం చెప్పలేక చంద్రబాబు నాయుడుని కాంగ్రెస్‌ అధిష్టానాన్ని, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని నిందిస్తుండటం చాలా విడ్డూరంగా ఉంది. ఈ పులి, సింహం పోరులో గెలిచేది ఎవరు?బలయ్యే మేకలు ఎవరు?అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానాలు లభించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories