జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పి ప్రధానమంత్రి కావాలనుకున్న కేసీఆర్, అటువంటి ఆలోచనలు చేయకపోయినా ఏపీలో మరో 30 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటాననుకున్న జగన్ ఇద్దరూ చివరికి ఒంటరి పక్షుల్లా మిగిలిపోవడం విచిత్రమే కదా?
Also Read – ఆ ఇద్దరు కలిస్తే…ఈ ఇద్దరికీ కడుపు మంటేగా.?
జగన్, కేసీఆర్ ఇద్దరిలో ప్రజాస్వామ్యం పాళ్ళు చాలా తక్కువ, అహంభావం పాళ్ళు చాలా ఎక్కువగా ఉండటం వలననే, ఇద్దరూ అధికారంలో ఉన్నప్పుడు తమని తాము చాలా గొప్పగా ఊహించుకున్నారు. అందువల్లే తమకి ఎవరి సాయం అవసరం లేదనుకున్నారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాలలో అన్ని పార్టీలను కలుపుకుపోవాలని ప్రయత్నించినప్పటికీ ఆయన అహంభావమే అందరినీ దూరం చేసుకునేలా చేసిందని చెప్పవచ్చు.
Also Read – ప్రమోషన్స్ తో పిచ్చెక్కిస్తున్నారుగా!
కనీసం 17 మంది ఎంపీలు కూడా లేకుండా 40,60,80 ఎంపీలున్న రాష్ట్రాలను తాను శాశించాలని, అన్ని పార్టీలు తన మేధాశక్తిని నమ్మి తన నాయకత్వాన్ని అంగీకరించాలనుకోవడం, ఎవరూ తనని ఎన్నుకోకపోయినా తాను ‘దేశ్ కీ నేత’, ‘కాబోయే ప్రధాని’ అంటూ అనుచర గణంతో భజన చేయించుకోవడం అహంకారమే కదా? అందువల్లే కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ఒంటరిగా మిగిలిపోయారు.
అందితే జుట్టు లేకుంటే కాళ్ళు అన్నట్లు మునుగోడు ఉప ఎన్నికలో వామపక్షాల మద్దతు లేకపోతే గెలవలేమని కేసీఆర్ గ్రహించినప్పుడు వెంటనే వాటితో పొత్తు పెట్టుకొని గెలిచారు. కానీ శాసనసభ ఎన్నికలలో వాటి అవసరం లేదని భావించి నిర్మొహమాటంగా పక్కన పడేసి ఒంటరిగా వెళ్ళి బోర్లా పడ్డారు. అంటే వాపుని చూసి బలుపు అనుకున్నారని అనుకోవచ్చు.
Also Read – ఆ రెండు పార్టీలకి గేమ్ చేంజర్ విశాఖపట్నమే!
కానీ ఓటమి తర్వాత ఇప్పుడు ప్రాంతీయపార్టీలను మాత్రమే ప్రజలు గెలిపించాలని, వాటికి మాత్రమే రాష్ట్రం, ప్రజల పట్ల నిబద్దత ఉంటుందనే ‘కొత్త సూత్రం’ కనిపెట్టి కొడుకు కేటీఆర్ చేత మహారాష్ట్ర ప్రజలకు చెప్పించారు.
కానీ ఈ ‘ప్రాంతీయ సూత్రం’ ఏపీలో టిడిపికి వర్తించదు కేవలం వైసీపికి మాత్రమే వర్తించాలనే ఓ ‘అప్రకటిత అమెండ్‌మెంట్’కి కేసీఆర్ నేటికీ కట్టుబడే ఉన్నారు.
జగన్ విషయానికి వస్తే ఆయనకు ఎప్పుడూ రహస్య స్నేహితులు, రహస్య అవగాహనలే తప్ప టిడిపి, జనసేన, బీజేపీల్లా బహిరంగంగా పొత్తులు పెట్టుకునే అలవాటు లేదు. ఒకవేళ పెట్టుకోవాలనే కోరిక ఉన్నా ఆయన ధోరణి చూసిన వారెవరూ ఆయనతో చేతులు కలిపే దుస్సాహసం చేయరు.
అందువల్లే ఏపీ రాజకీయాలలో ఏకాకీగా మిగిలిపోయిన జగన్… టిడిపి, జనసేన, బీజేపీల పొత్తులు రాజకీయ వ్యభిచారమని వితండవాదం చేస్తుంటారు.
కానీ ఎన్నికలలో ఓటమి తర్వాత కూడా చెల్లి షర్మిల పక్కలో బల్లెంలా మారడం, ఏదో ఓ కేసులో ఇప్పుడు కాకపోతే రాబోయే రోజుల్లోనైనా జైలుకి వెళ్ళక తప్పదనే భయంతోనో లేదా మోడీ, అమిత్ షాలకు దూరంగా ఉండిపోవలసినందునో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకు, అలవాటు ప్రకారం తెర వెనుక ప్రయత్నాలు చేశారు.
కానీ కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎటువంటి సానుకూల సంకేతాలు రాలేదు. బహుశః మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ కూటమి గెలిస్తే వస్తాయేమో? కానీ ప్రస్తుతానికి జగన్ ‘సింగిల్ బట్ కాంట్ మింగిల్ విత్ ఎనీవన్… ఇంక్లూడింగ్ మామ్ అండ్ సిస్!
కనుక అక్కడ ఫామ్‌హౌస్‌లో కేసీఆర్, ఇక్కడ తాడేపల్లి ప్యాలస్‌లో జగన్ గృహనిర్బంధం విధించుకొని సొంత మీడియా ద్వారా లోకాన్ని చూస్తూ, జనాలకు కూడా చూపిస్తున్నారు.
అక్కడ కేసీఆర్ తన కొడుకు, మేనల్లుడు ద్వారా, ఇక్కడ జగన్ ట్వీట్టర్ ద్వారా లోకాన్ని పలకరిస్తూ తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ఈ రెండు ఒంటరి పక్షులు గృహనిర్బందం నుంచి ఎప్పుడు బయటకు వస్తాయో చూడాలి.