ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం విశాఖపట్నంలో వాహనమిత్ర పధకానికి రూ.261.51 కోట్లు విడుదల చేశారు. ఈ పధకంలో ఆటోరిక్షాలు, క్యాబ్‌లు, మాక్సీ వాహనాలు నాడుకొని జీవనం సాగిస్తున్నవారికి ఒక్కరికీ రూ.10,000 చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా సిఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, “నేను చూశాను… నేను విన్నాను… నేనున్నాను… అని ఆనాడు నేను చెప్పిన మాటకు కట్టుబడి అధికారంలోకి రాగానే దేశంలో మరెక్కడా లేని ఈ పధకాన్ని ప్రారంభించి ఇప్పటివరకు రూ. 1,026 కోట్లు లబ్దిదారులకు అందజేశాను. మనది పేదల ప్రభుత్వం కనుకనే కులమతాలు, పార్టీలు, ప్రాంతాలు అని చూడకుండా అర్హులైన ప్రతీపేదవాడికి ఈ పధకం ద్వారా రూ.10 వేలు చొప్పున అందిస్తున్నాను,” అని అన్నారు.
ఈ సందర్భంగా ఈ మూడేళ్ళలో అన్ని పధకాలకు కలిపి రూ.1.65 లక్షల కోట్లు పంచిపెట్టామని జగన్ గర్వంగా చెప్పుకొన్నారు.
ఈ మూడేళ్ళలో జగన్ ప్రభుత్వం సుమారు రూ.7-8 లక్షల కోట్లు అప్పులు చేసినట్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, ప్రతిపక్ష టిడిపి, కాంగ్రెస్ పార్టీలు చెపుతున్నాయి. దానిలో రూ.1.65 లక్షల కోట్లు సంక్షేమ పధకాలకు ఖర్చు చేశామని సిఎం జగన్ స్వయంగా చెప్పుకొన్నారు. కనుక మిగిలిన రూ.5.5 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు? అనే సందేహం కలుగక మానదు.
ఎందుకంటే గత మూడేళ్ళుగా రాష్ట్రంలో అంతంత మాత్రంగానే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. లక్షల కోట్లు అప్పులు తెచ్చినా రాష్ట్రంలో రాజధాని నిర్మించలేదు… పోలవరం పూర్తిచేయలేమని మంత్రి అంబటి చేతులెత్తేశారు కూడా. రాష్ట్రవ్యాప్తంగా గుంతలు పడిన రోడ్లకు కనీసం మరమత్తులు చేయించలేదని ప్రతిపక్షాలు, మీడియా ఫోటోలు, వీడియోలతో సహా చూపుతున్నాయి. లక్షల కోట్లు అప్పు చేసి అభివృద్ధి చేయలేదు… మౌలిక వసతులు కల్పించలేదు. ఆ సొమ్ములో కొంత మాత్రమే సంక్షేమ పధకాలకు ఖర్చు చేశారు. మరి మిగిలింది ఎక్కాడా?



