నంద్యాల ఉపఎన్నిక ముందు శిల్పా మోహన్ రెడ్డి టీడీపీ నాయకత్వంతో విభేదించి వైకాపాలో జాయిన్ అయ్యారు. వైకాపా టికెట్ పొంది ఆ ఎన్నికలో ఘోరంగా ఓడిపోయారు. అంతకంటే ముందే ఆయన సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డిని తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి వైకాపాలోకి తెచ్చారు.
ఆ విధంగా శిల్పా సోదరులు అన్ని విధాలుగా నష్టపోయినట్టు అయ్యింది. మరో వైపు శిల్పా చక్రపాణి రెడ్డి తిరిగి టీడీపీకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ తరుణంలో నష్టనివారణ చర్యలు చేపట్టారు జగన్. శిల్పా చక్రపాణి రెడ్డి ని నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి గా నియమించారు.
రాష్ట్రంలోని ఒక్కో పార్లమెంట్(లోక్‌సభ) నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా పరిగణిస్తూ వాటికి పార్టీ అధ్యక్షులను వైకాపా ప్రకటించింది. వైకాపా అధికారంలోకొస్తే ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తామని జగన్ ఇటీవల నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. అందులో భాగంగానే ఇప్పుడు పార్టీ పరంగా విభజనకు తెరదీశారు.


